Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘రివర్స్ కౌన్సెలింగ్’కు ఈటెల మొగ్గి ఉంటే ఏం జరిగేది!?

సరిగ్గా ఇరవై ఆరున్నర నెలల క్రితం.. తేదీ గుర్తుందా..? 2023 మే 4వ తేదీన బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్, అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. ఆయా బీజేపీ నాయకులు హైదరాబాద్ నుంచి బయలుదేరి 200 కి.మీ. దూరంలో గల ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకోవడంతో ఒక్కసారిగా మీడియా అలర్ట్ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యంగా టీవీల్లో భారీ ఎత్తున ఫుల్ ప్లేట్ బ్రేకింగ్ న్యూస్ లు. మాంచి ఎండాకాలం కావడంతో తన ఇంటికి వచ్చిన బీజేపీ నేతలను చల్లని కొబ్బరి బోండాలతో పొంగులేటి స్వాగతించారు. కొబ్బరి నీళ్లను సేవించిన బీజేపీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అంతర్గతంగా చాలాసేపు చర్చించి తిరిగి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే..

అదే నెల.. మే 29వ తేదీన బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఆసక్తికర ఘటనను వెల్లడించారు. మాజీ ఎంపీ (ప్రస్తుత మంత్రి) పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకుందామనుకుంటే వాళ్లే తనకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని ఈటెల రాజేందర్‌ హైదరాబాద్ లో పేర్కొన్నారు. పొంగులేటిని, జూపల్లిని కాంగ్రెస్‌లో చేరకుండా మూడు నెలలపాటు నిలువరించినట్లు కూడా ఈటెల అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత పరిణామాల్లో జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ప్రభుత్వంలో పొంగులేటి కీలక మంత్రిత్వ శాఖల అమాత్యునిగా మారడం తెలిసిందే.

అప్పటి ఈ ఉదంతాలను ఇప్పుడు గుర్తు చేయడం దేనికంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ రెండుచోట్లా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. తన పూర్వ నేపథ్య భావజాలానికి విరుద్దంగా రాజేందర్ బీజేపీలో చేరడమే ఓ రాజకీయ విశేషం. వాస్తవానికి ఈటెల రాజేందర్, ఆయన సతీమణి జమున.. ఇద్దరూ వామపక్ష భావజాల నాయకులే. చీలికలకు ముందు ఐక్యంగా గల చండ్రపుల్లారెడ్డి నక్సల్ గ్రూపు అనుబంధ PDSUకు విద్యార్థి సంఘ నాయకులే.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఆ తర్వాత రాజకీయ పయనంలో కేసీఆర్ వెంట నడిచిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. కేసీఆర్ తో విభేదించిన రాజేందర్ బీజేపీలో చేరడానికి వెనుక గల బలమైన కారణం ‘సేఫ్టీ’గా రాజకీయ పరిశీకులు విశ్లేషిస్తుంటారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ‘డిఫెన్స్ మోడ్’లో ఉంది. కేసులు తదితర సమస్యలతో అనివార్యంగా ఈటెల కేంద్రంలో అధికారంలో గల బీజేపీలో చేరాల్సి వచ్చిందనేది అతని అనుయాయుల భావన. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఈటెల రాజేందర్ బీజేపీలోని వర్గ రాజకీయాల ‘సెగ’కు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లే కనిపస్తోంది. మరీ లోతుల్లోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పాలంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఈటెలకు పొసగడం లేదు. ఇద్దరి మధ్యా అగాధం భారీగానే ఏర్పడినట్లు బహిర్గతమైంది.

శామీర్ పేటలోని తన నివాసంలో ఈటెల రాజేందర్ మాట్లాడినప్పటి చిత్రం

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తమ నాయకుడిని తప్పించడం వెనుక ఈటెల రాజేందర్ హస్తముందనేది బండి సంజయ్ అనుచరుల వాదన. తాజాగా తమ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా పోవడంలో బండి సంజయ్ రివెంజ్ రాజకీయం ఉందనేది రాజేందర్ అనుయాయుల అనుమానం. మొత్తంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర అగాధానికి దారి తీసిందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయాం. ఈ నేపథ్యంలోనే ఇటీవల బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన అనంతరం రాజేందర్ వర్గీయులకు రాజకీయ భవితపై అభద్రతా భావం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాము ఎదుర్కుంటున్న రాజకీయ స్థితిని చెప్పుకునేందుకు హుజూరాబాద్ కు చెందిన ఈటెల అనుచరులు శామీర్ పేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. తన అనుచరులు చెప్పిన అంశాలపై స్పందిస్తూ ఈటెల రాజేందర్ ఒక్కసారిగా భగ్గుమన్నారు.

పొంగులేటిని బీజేపీలో చేర్చుకునేందుకు ఈటెల రాజేందర్ ఖమ్మం వచ్చినప్పటికి చిత్రం

ఇవీ ఈటెల రాజేందర్ ఆగ్రహ వ్యాఖ్యలు. గరం గరంగా ఈటెల చేసిన ఆయా వ్యాఖ్యలు బండి సంజయ్ గురించేనంటూ వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలపై పార్టీకి చెందిన నాయకులెవరూ స్పందించవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. రాష్ట్ర బీజేపీలోని తాజా పరిణామాలపై పార్టీ జాతీయ నాయకత్వం నివేదికలను తెప్పించుకుంటోంది. రాజేందర్ ‘బీసీ వాద’ పార్టీ ఏర్పాటు చేస్తారనే గాలి వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తంగా ఈటెల రాజేందర్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ నేపథ్యంలో ఓసారి 2023 మే 4వ తేదీనాటి పరిణామాలపై తొలి పేరాగ్రాఫ్ లోని కంటెంట్ ను మళ్లీ ఓసారి మననంలోకి తీసుకుంటే.. బీజేపీలో చేర్చుకునేందుకు తన ఇంటికి వచ్చిన కాషాయ పార్టీ నేతలకు పొంగులేటి ఇచ్చిన ‘రివర్స్ కౌన్సెలింగ్’ ప్రభావానికి ఈటెల రాజేందర్ మొగ్గి ఉంటే అప్పట్లోనే ఈటెల కాంగ్రెస్ లో చేరితే ఆయన రాజకీయ భవిత మరో విధంగా ఉండేదా? పొంగులేటి, జూపల్లి సరసన ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉండేవారా? ఏ రంగంలోనైనా సరే భావ సారూప్యత కుదరని వ్యక్తుల మధ్యగాని, లీడర్ల మధ్యగాని, వ్యవస్థల మధ్యగాని బంధం కలకాలం నిలవదా? ప్రస్తుతం బీజేపీలో గల ఒకప్పటి ‘కామ్రేడ్’ ఈటెల రాజేందర్ తాజా రాజకీయ స్పందనపై పొలిటికల్ సర్కిళ్లలో రేకెత్తుతున్న ప్రశ్నలు, వాటి అనుంబంధంగా జరుగుతున్న చర్చ ఇదే..!

Popular Articles