ఖమ్మం మార్కెట్లో పతనమైన మిర్చి ధరపై సీపీఎం ఆగ్రహించింది. క్వింటాల్ మిర్చికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, ఏఐకేఎస్, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మహాధర్నా నిర్వహించింది. ఎర్రజెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ, క్వింటాల్ మిర్చికి రూ.25వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిర్చిని వ్యాపార పంటగా కాకుండా ఆహార పంటగా గుర్తించాలన్నారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా రూ.25 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే మార్కెట్లో క్వింటా మిర్చి 2023లో రూ.25,500 పలుకగా, ఇప్పుడు కేవలం రూ.11 వేల నుంచి 13వేలకే కొనుగోలు చేస్తుండటంపై ఆగ్రహించారు.
రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో మిర్చి సాగైందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, రాష్ట్రంలో ఈ ఏడాది 447 మంది రైతులు చనిపోయారని, జిల్లాలో మిర్చి కారణంగా నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇంతమంది రైతులు చనిపోతున్నా మిర్చి ధరలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి వ్యవసాయ రంగం గురించి పట్టదని, రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉండి ఏమి ఉపయోగమని ప్రశ్నించారు.

ధరల స్థిరీకరణకు ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి:
అటు గుంటూరు ఇటు వరంగల్ మిర్చి మార్కెట్లకు మధ్యలో ఉన్న అతి పెద్ద మార్కెట్ ఖమ్మంలో ధరల స్థిరీకరణ కోసం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో వామపక్షాల భాగస్వామ్యంతో పనిచేసిన యూపీఏ ప్రభుత్వం మిర్చికి 10% కంటే ధర తగ్గినప్పుడు గిట్టుబాటు ధర కోసం చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో రూ.500 కోట్ల డాలర్ల ఆయుధ హెలికాప్టర్ల కొనుగోళ్లపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో ఒప్పందం చేసుకున్న మోదీ అమెరికా, చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యే తేజా, ఆర్మూర్ రకం మిర్చి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పంటలు, ఎరువులు, పురుగుమందులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులు పురుగుమందులపై రూ.50వేల పెట్టుబడి పెడితే 18% జీఎస్టీ పేరుతో రూ.9వేలు పన్ను కట్టాల్సి వస్తోందని వివరించారు. పంట అమ్మకాలపైనా జీఎస్టీ వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పంటలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎరువులపై 10-30% పన్నులు, డీజిల్, పెట్రోల్‌పై కమీషన్లు దండుకుంటున్న కేంద్రప్రభుత్వం మిర్చి పంట ధరను 60% తగ్గించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ దుర్మార్గంగా వ్యవహారించే ప్రభుత్వాలున్న తరుణంలో ఉద్యమించకపోతే రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. రైతులు పోరాటాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

స్పందించకుంటే మంత్రుల క్యాంప్ కార్యాలయాల ముట్టడి : నున్నా నాగేశ్వరరావు
ఈ సీజన్‌లో ఇప్పటికీ రెండుసార్లు మిర్చి ధరల పెంపుపై ఆందోళనలు చేశాం… మిర్చి రైతులు మరణిస్తున్నారు.. ఇప్పటికీ జిల్లాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇకనైనా స్పందించకపోతే మిర్చి రైతులతో మంత్రుల ఇళ్లు, క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తామని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. వివిధ రకాల తెగుళ్లకు రైతు ఒక్కసారి పురుగుమందు కొడితే ఎకరానికి రూ.2 వేలకు పైగా ఖర్చు వస్తుందని, అలాంటిది సీజన్‌కు 20 సార్లకు పైగా పిచికారీ చేయాల్సి వస్తోందన్నారు. పురుగుమందులపై రూ.లక్ష పెట్టుబడికి జీఎస్టీ కేంద్రానికి రూ.18వేలు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ఉన్నాయన్నారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటుకు ఎంపీ రఘురాంరెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. మిర్చి ధర రూ.15వేలకు తగ్గకుండా చూస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మిర్చి బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బంతు రాంబాబు కోరారు. సుగుంధద్రవ్యాల బోర్డు నుంచి విడదీసి మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్, జిెల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావ్, రైతుసంఘం సీనియర్ నాయకులు తాతా భాస్కర్‌రావు, కొక్కెర పుల్లయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, ఆయిల్‌పామ్ రైతుసంఘం నాయకులు మహేశ్వరరెడ్డి, రైతుసంఘం నాయకులు ఎస్.నవీన్‌రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, ఊరడి సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.