Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

‘తమ్మినేని’పై సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన లేఖ లీక్!

(సమీక్ష ప్రత్యేక కథనం)
సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం, మరికొందరు నాయకుల తీరును ప్రశ్నిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ రాసిన అభిశంసన లేఖ లీకైంది. గత జనవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన లేఖను పంపిస్తున్నామని, దీన్ని శాఖ స్థాయి వరకు వివరించాలని ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పేరుతో ఈ లేఖను రాష్ట్ర కమిటీకి రాయడం గమనార్హం.

తీవ్రమైన నిర్మాణ అనైక్యతను, ముఠా తత్వం, ప్రమాణాల ఉల్లంఘన, కొనసాగుతున్న అస్తిత్వవాద రాజకీయ ప్రభావం, తప్పుడు రాజకీయ ధృక్పథం, ఫెడరల్ ధోరణులు, తరిగిపోయిన పార్టీ విలువలు వంటి అనేక అంశాలను కూలంకషంగా వివరిస్తూ ఈ లేఖలో ప్రస్తావించడం విశేషం. కేంద్ర కమిటీ రాసిన ఆయా లేఖలోని సారాంశపు విశేషాలు ఇవీ:

  • గత కొన్నేళ్లుగా తెలంగాణా శాఖను తీవ్రమైన రాజకీయ, నిర్మాణ సమ్యలు ఆవరించి ఉన్నాయి. సంగారెడ్డి పట్టణంలో 2025 జనవరిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఇవి తారాస్థాయికి చేరాయి. అవి పార్టీ ఆల్ ఇండియా మహాసభలో కూడా ప్రతిబింబించాయి. కొన్ని జిల్లా పార్టీ మహా సభల్లో సైతం తీవ్రమైన పెడధోరణులు వ్యక్తమయ్యాయని రిపోర్ట్ చేయబడింది.
  • ఈ సమస్యలను చేపట్టి, తప్పుడు ధోరణులను సరిచేసి, నిర్మాణానికి పదును పెడితే తప్ప, పార్టీ ముందున్న కర్తవ్యాలను సమర్థవంతంగా నెరవేర్చలేం. పార్టీ, ప్రజా సంఘాల బలోపేతం కూడా సాధ్యం కాదు.
  • ఈ సమస్యల తీవ్రత దృష్ట్యా తెలంగాణా పార్టీకి ఈ లేఖ రాయాలని కేంద్ర కమిటీ భావించింది. తెలంగాణా పార్టీలోని పొరపాటు ధోరణులు, అభిప్రాయాలను, నిర్మాణ లోపాలను స్పష్టం చేస్తూ ఈ లేఖ రాయబడింది.
  • పార్టీ గత రాష్ట్ర మహాసభ సమయంలో అనేక అభ్యంతరకమైన, అనంగీకారమైన ధోరణులు, ప్రత్యేకించి నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకునేప్పుడు అత్యంత తీవ్రమైన రూపంలో కనిపించాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించబడింది. ప్రజాతంత్రయుతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయి. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలివేయబడ్డాయి.
  • ఇలాంటి ప్రవర్తనకు సీనియర్ నాయకులే పాల్పడడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అది పార్టీ సంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమైనది.
  • రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం పార్టీ సమిష్టి ప్రయోజనాలు, సూత్రాలకన్నా మిన్నగా, వ్యక్తిగత ఆకాంక్షలతోనూ తమకు నచ్చినట్లుగానూ అస్తిత్వ రాజకీయాలతోనూ, వ్యక్తిగత ముఠా ప్రయోజనాలతోనూ వ్యవహరిస్తున్నారని కూడా చర్చల్లో వెల్లడైంది.
  • అస్తిత్వాలను, సెంటిమెంట్లను దుర్వినియోగపర్చడంతో సహా, సూత్రరహితమైన బూర్జువా పద్ధతులను అనుసరించడానికి వారు వెనుకాడడంలేదు.
  • కేంద్ర కమిటీ సభ్యుడు టి. వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, బి. ప్రసాద్ లు ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని భావించిన కేంద్ర కమిటీ, నిర్మాణానికి సంబంధించి తగని విధంగా ప్రవర్తించిన ఈ కామ్రేడ్స్ పై క్రమశిక్షణా చర్య తీసుకున్నదని, ఈ ముగ్గురు కామ్రేడ్స్ ను అభిశంసించిందని కేంద్ర కమిటీ ప్రకటించింది.
  • కామ్రేడ్ వీరభద్రాన్ని రాష్ట్ర సెక్రటేరియల్, కమిటీ సమావేశాల్లో పరిశీలకునిగా నడుచుకోవాలని, రాష్ట్ర సెక్రటేరియట్ డైరెక్షన్ లో పనిచేయాలని కేంద్ర కమిటీ ఆదేశించిందని పేర్కొంది. తమ పొరపాట్లను గుర్తించి, సరిచేసుకునేందుకు దోహపడతాయనే ఉద్ధేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర కమిటీ తన లేఖలో స్పష్టం చేసింది.

Popular Articles