‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై జరుపుతున్న అమానుష దాడులను ఆపివేయాలని ఆయన కోరారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, గత సంవత్సర కాలం నుండి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేస్తామంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టుల నుంచి రెండుసార్లు ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అణిచివేత చర్యలకు పాల్పడటం దారుణమని వ్యాఖ్యానించారు. పౌర సమాజంలోని అనేకమంది మేధావులు , పౌరహక్కుల నేతలు శాంతి చర్చలకు తాము ఇరువైపుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదన్నారు.

అనేక రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు సైతం శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. వేలాది మంది పారా మిలటరీ బలగాలను కర్రెగుట్టల చుట్టూ మోహరించి, ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనలు చేయడం ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
మధ్య భారత దేశంలోని అడవులలో ఉన్న అపారమైన సహజ వనరులను, విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ కార్యక్రమాన్ని ఎంచుకుందని తమ్మినేని ఆరోపించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను, మావోయిస్టుల పేరు మీద ఆదివాసీల మీద తీవ్రమైన అణచివేత చర్యలకు తెగబడుతూ చివరికి హత్యలు చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రక్తపాతాన్ని ఆపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధపడాలని ఆయన కోరారు. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అలా జరగకపోతే తాము దేశంలోని ప్రజాస్వామిక శక్తులను, వామపక్ష ప్రతిపక్ష పార్టీలను, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్,సీనియర్ నాయకులు యం.సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, షేక్ బషీరుద్దీన్, పిన్నింటి రమ్య, నాయకులు ఆర్.ప్రకాష్ ,టీ ఎల్ నరసయ్య, డా.భారవి, బోడపట్ల రవీందర్, యమ్ డి రఫీ, మల్లెంపాటి వీరభద్రం,ప్రవీణ్,విప్లవ్ కుమార్,నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.