ఖమ్మం: భూదాన్ బూములపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పేదల కోసం దాతలు ఇచ్చిన భూదాన్ భూములు రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా ఉన్నయని చెప్పారు. ఈ భూములను అనేక మంది అక్రమార్కుల కబ్జా చేశారని, భూదాన బోర్డులోని వారు సైతం వారి ఇష్టాఇష్టాల ప్రకారం అనేక రకాలుగా అక్రమాలతో అమ్ముకున్నారని ఆరోపించారు. చివరకు గత ప్రభుత్వం, అధికారులు కలిసి ఆ రికార్డులన్నీ మాయం చేశారని, పేదలకు చెందాల్సిన ఆ భూములపై రికార్డులు వెలికి తీసి, వాటి వివరాలన్నీ ప్రజలకు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కుల చేతిలో గల భూములను విడిపించి నిజమైన పేదలకు పంచాలని కూడా వారు కోరారు.
అదేవిధంగా ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో పేదల ఇండ్లు కూలగొట్టి, తామే ఇండ్లు ఇచ్చామనే ప్రభుత్వ, అధికారుల వైఖరి అన్యాయమైనదిగా పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్యలు అభివర్ణించారు. ఆ ఇండ్లను కూలగొట్టకుండా నిజమైన అర్హులకు ఇవ్వాల్సిందన్నారు. తమ పార్టీతో సహా అనేక మంది ఆ డిమాండ్ చేసినా అక్రమార్కుల బూచీ చూపి ప్రభుత్వం కూలగొట్టిందన్నారు. అయితే అఖిల పక్ష పార్టీలు, సంస్థలు, వ్యక్తులు వారి వారి పద్ధతుల్లో చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి అక్కడ 311 మందికి పట్టాలు ఇచ్చిందన్నారు.
కానీ 2018 నుంచి అక్కడ ఇండ్లు వేసుకున్న, ఆ స్థలంలో వున్న పేదలలో చాలా మందికి, ఇంకా చెప్పాలంటే ఎక్కువ మందికి అవకాశం రాలేదని వారు పేర్కొన్నారు. చాలా మంది మధ్యలో చేరిన వారికి, మధ్యవర్తుల ప్రమేయంతో వచ్చిన వారికి ఇండ్లు వచ్చాయన్నారు. కూల్చివేత చర్య అనేక నష్టాలను తెచ్చిందని, పేదల జీవితాలలో విధ్వంం సృష్టించిందన్నారు. అందుకే జిల్లా అధికారులు, ప్రభుత్వం అక్కడ నివసించిన పేదలందరికి తగిన పరిశీలన ద్వారా గుర్తించాలని, వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాగా ఇరాన్ పై అన్యాయంగా, దుర్మార్గంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అలీన విధాన భారతదేశం భద్రతా మండలిలో ఇరాన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడం, అమెరికా దురాక్రమణను పల్లెత్తు మాట అనక పోవడ మన దేశ 145 కోట్ల ప్రజలకు, దేశాభిమానానికి అవమానకరమైనదిగా మాస్ లైన్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.. అమెరికా దురాక్రమణ ముందు మోడీ ప్రభుత్వం తలవంచి, లొంగి పోవడం తప్ప ఇది మరొకటి కాదని అభిప్రాయపడ్డారు.
ఇరాన్ తో స్నేహపూర్వక దేశంగా మన దేశం వుండి, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి బలపరచకపోవడం, ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖోమైనీ దారుణ హత్యను ఖండించక పోవడం అన్యాయమైనదిగా చెప్పారు. అదానీ కేసు, అంబానీ పెట్టుబడులకు అమెరికాలో లాభం చేకూర్చడం కోసం, ఎప్ స్టీన్ పైల్స్ లోగుట్టును మరుగుపరచు కోవడం కోసం మోడీ ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా భారతదేశం అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించి, ఆపడానికి, శాంతి నెలకొనడానికి కృషి చేయాలన్నారు. యుద్ధం సాకుగా గ్యాస్ ధరలు పెంచడాన్ని, గ్యాస్ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరతను సృష్టించడాన్ని, ప్రజలపై భారం మోపే పద్ధతులను నివారించాలని డిమాండ్ పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్యలు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మాస్ లైన్ పార్టీ నాయకుడు గుండా సత్యనారాయణ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, వరగాని కోటేశ్వరరావు, సీ వై పుల్లయ్య, జి రామయ్య, ఆవుల అశోక్, మలీదు నాగేశ్వరరావు, కోలెటి నాగే శ్వరరావు, సీహెచ్. శిరోమణి, టి. ఝాన్సీ , ఎ. మంగతాయి, ప్రతాప్ నేని శోభ, ఆజాద్, కె. శ్రీనివాస్, కవిత, మేడి అనిత తదితరులు కూడా పాల్గొన్నారు.

