Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

అంతమాత్రాన కమ్యూనిస్టులు కాడి పడేస్తారా!. ఖమ్మం పిలుస్తోంది.. పోయి రావలె!

…మన ఒంట్లోని నెత్తురు ఎరుపు, గులాబీ రంగు ఎరుపు, మార్పు కోరే వాళ్ల జెండా ఎరుపు.. మలుపు తిరిగే చోటా, ముప్పు నివారించే చోటా ఎరుపు, మార్కులేసే చోటా ఎరుపే.. అయినా శ్రీ.శ్రీ. ఎందుకో ‘ఎరుపంటే కొందరికి భయం, భయం.. వాళ్లకంటే పసిపిల్లలు నయం, నయం’ అన్నారు.

ఇంతకీ సంగతేంటంటే., కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో పుట్టి వందేళ్లైంది. “తారీఖులు దస్తావేజులు.. ఇవి కావోయ్ చరిత్రకర్థం” అంటున్నప్పటికీ, ఈ డేట్లపైనా వాళ్లల్లో వాళ్లకి తకరారు ఉంది. సీపీఐకి ఇప్పటికే రజతోత్సవం, స్వర్ణోత్సవం, మణి మహోత్సవం, అమృతోత్సవం జరిగాయి. ఇప్పుడు శతాబ్ది ఉత్సవం. ఇందుకు వేదిక ఖమ్మంమెట్టు అనే ఖమ్మం. కమ్యూనిస్టుల ఖిల్లా. ఈనెల 18న ఖమ్మం మరోసారి ఎరుపెక్కనుంది. లెక్కకు మిక్కిలి జనం వస్తారని సీపీఐ నేతలు చెబుతున్నారు.

శతాబ్ది ఉత్సవాల ముగింపు మీటింగ్ ముచ్చట్లు చెప్పడానికి- ఈమధ్య కొత్తగూడెం ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం, పార్టీ సీనియర్లు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, పార్టీ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ, నరసింహాలాంటి వాళ్లందరూ మాట్లాడుకుని- మీడియా వాళ్లను మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు.

నేనూ చాలా కాలం కమ్యూనిస్టు పార్టీల బీట్లను చూసిన జర్నలిస్టును కావడంవల్లనో.. లేక మా మంచి మిత్రుడు బొమ్మగాని కిరణ్ చెప్పడం వల్లనో ఏమో- నేనంటే బాగుండే కె. దశరథ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. కమ్యూనిస్టు పార్టీ పిలుపు కదా..? ఉండబట్టలేక నేనూ వెళ్లా. అప్పటికే అందరూ హైదరాబాద్ మినర్వా హోటల్ లో సుఖాసీనులై ఉన్నారు. నాతో పాటు ఈ బీట్ చూసిన పాత మొహాలు రెండుమూడే కనబడ్డా నాయకులందరూ పాతవాళ్లే గనుక బెరుకులేకుండా వెనక సీట్లో కూర్చున్నా.. (పార్లమెంటులో కూడా బ్యాక్ బెంచ్ కి పెద్ద ప్రాధాన్యం ఉంటుంది తెలుసుకదా!).

ఉపన్యాసాలు షురూ అయ్యాయి..

నిజానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చరిత్ర రాస్తే రామయణం, వింటే మహాభారతం. 1917- రష్యా విప్లవం ప్రపంచాన్ని కుదిపేస్తే ఆ చైతన్య కెరటాలు… నదీనదాలను, హిమాలయాలను దాటి భారతదేశాన్నీ తాకాయి. వందేళ్ల కిందట ఇంగ్లీషోడి పాలనలో ఇండియాలో రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు- సంస్థల రూపంలో పురుడుపోసుకున్నాయి. ఒకటి భారత కమ్యూనిస్టు పార్టీ మరొకటి – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. మహాత్మాగాంధీని మట్టుబెట్టినట్టు ఆరోపణలున్న ఆర్ఎస్ఎస్ ఈరోజు అసాధారణ శక్తి. త్యాగాలు, పోరాటాల పునాదుల మీద పుట్టామని చెప్పే సీపీఐ తుపానులో చిక్కిన నావ.

1925 డిసెంబర్ 26 నుంచి 28 వరకు కాన్పూరులో జాతీయ సదస్సు నిర్వహించాలని బొంబాయిలో ఉండే శ్రీపాద అమృత్ డాంగే, విదేశాల్లో ఉన్న విప్లవకారుడు సత్యభక్త్ లాంటి వాళ్లు అనుకున్నారు. మీటింగు పెట్టారు. 500 మంది వచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని అధికారికంగా ప్రకటించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం హడలెత్తింది. ‘బోల్షెవిక్ ప్రమాదం’పై నిఘా పెంచింది. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లాంటి వాళ్ల తలలు తీయించింది. ఊపిరి కాపాడుకున్న అజయ్ ఘోష్ ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.

ఇలా అనేకం జరిగాక.. స్వాతంత్య్రం వచ్చాక.. పార్లమెంటుకు 1951-52లో జరిగిన తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో సీపీఐ దేశంలో రెండో పెద్ద పార్టీ. 1957లో కేరళలో కమ్యూనిస్టు EMS నంబూద్రిపాద్ సర్కార్.. ఇక అధికారమే తరువాయి అనుకుంటుంటే కాంగ్రెస్ ఊరకుంటుందా? రెండేళ్లు తిరక్కుండానే నంబద్రిపాద్ ను బర్తరఫ్ చేసేసింది. కమ్యూనిస్టులు కుయ్యో..మొర్రో అనేట్టు చేసింది. అయినా ఈ మొండోళ్లు పట్టువీడకుండా జనంలో ఉన్నారు. 1964 వరకు 3 లోక్‌సభల్లో ప్రధాన ప్రతిపక్షం సీపీఐ.

ఇంతలో వీళ్లలో వీళ్లకే ముసలం.. ఆలోచనలు, వ్యూహాలు మారాయి. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో.. మొదటి ముగ్గురు అందరికీ ఓకే.. చివరి ఇద్దర్లోనే తేడా.. వ్యూహాల మార్పు.. నిషేధాల మధ్య పార్టీ సభ్యత్వ పతనం. 1964లో CPI మహా చీలిక, CPI(M) అవతరణ.

ఆ తర్వాతి కాలప్రవాహంలో కొడవలి పదును తగ్గింది. కంకులు చెల్లాచెదరయ్యాయి. చీలికలు ‘అనివార్యం’ అయ్యాయి. అంతమాత్రాన కమ్యూనిస్టులు కాడిపడేస్తారా!.

కొన్ని రోజులు భారంగా అనిపించవచ్చు, దానర్థం ఆగిపోయారని కాదు. పురోగతి నెమ్మదిగా ఉన్నా, అదీ పురోగతే. ఓటమి గెలుపునకు పునాది. జీవితాల్ని ఫణంగా పెట్టి పోరాటాలకు పదును పెట్టే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ హోల్ టైమర్లు కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటలు.

ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త అనిల్ రాజిమ్వాలే చెప్పినట్టు – “కమ్యూనిస్టులు మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారి” జనంలో నిలబడతారు, కొట్లాడతారు.

ఆ స్ఫూర్తికి ఈ వందేళ్ల ఉత్సవం సాయపడుతుందని అందరూ చెప్పి చేతులు కడుక్కుంటుంటే మా మిత్రుడు పి. ఆంజనేయులు “ఓ ఫోటో దిగుదామా” అన్నాడు. ఇంతలో అటొచ్చిన సహచరులు సతీష్‌ ఓరుగంటి, నాదెండ్ల తిరుపతయ్య, శ్రీనివాస్‌, అజిత.. ‘మేము రావొద్దా’ అన్నారు. అదిగో అలా వచ్చిందే ఈ ఫోటో.

తిండి తిన్నాక ‘ఇక బయల్దేరదామా’ అని మరో మిత్రుడు మురళికృష్ణ అంటుంటే ఇంతదూరం వచ్చి కామ్రేడ్ మఖ్ధూం పటాన్ని చూసి ఆయనకో దండం పెట్టి వద్దామన్నా. ఆయన పేరుతో గల భవనం ఈ నూరెళ్ల పండక్కి సర్వాంగ సుందరంగా తయారైంది. కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరి పోసిన యోధులు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన వీరులు, అసువులు బాసిన అమరులు ఎందరెందరివో చిత్రపటాలు దర్శనం ఇచ్చాయి. అందరికీ తలలు వంచి నమస్కరించాం. నాలుగంతస్థులు తిప్పి చూపిన కూనంనేనికి ధన్యవాదాలు చెప్పి మఖ్ధూం భవన్ ముందు ఇలా ఓ ఫోటో దిగి ఆఫీసుల బాట పట్టాం.

Popular Articles