భారత ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 781 మంది ఎంపీలు ఓటర్లు కాగా, ఇందులో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన 452 ఓట్లు సాధించడం విశేషం. ఇండియా కూటమి తరపున బరిలోకి దిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించార. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటింగులో పాల్గొనలేదు. మొత్తం 14 మంది ఓటింగుకు గైర్హాజరు కాగా, 15 మంది ఎంపీల ఓట్లు చెల్లలేదు.

పదిహేడవ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మూడో వ్యక్తి కావడం మరో విశేషం. గతంలో ఇదే రాష్ట్రానికి చెందిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్. వెంకట్రామన్ ఉప రాష్ట్రపతిగా పని చేశారు. కాగా సీపీ రాధాకృష్ణన్ కు బీజేపీలో ‘తమిళనాడు మోదీగా’ పేరుంది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు చెప్పారు.


