అతను కోయంబత్తూరు నుంచి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. తిరిగి 1999లో గెలిచి ఐదేళ్లు ఎంపీగా కొనసాగారు. ఇక అన్నీ వరుస ఓటములే! మూడు సార్లు వరుసగా ఓటమిని చవి చూశారు. కానీ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వీరాభిమాని, క్రమశిక్షణ గల నేత. తమిళనాడులో బీజేపీ విస్తృతి కోసం విశేష కృషి చేశారు.. కానీ ఫలితం లేదు. అతనే సీపీ రాధాకృష్ణన్.
తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజీనామా చేసినప్పుడు పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా, తెలంగాణ గవర్నర్ గానూ మూడు నెలలు పని చేశారు. జార్ఖండ్ గవర్నర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ అదృష్టవంతుడు అనే చెప్పాలి. బీజేపీ సీనియర్ దిగ్గజాల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటకే ప్రాధాన్యం ఇచ్చారు!


భారత ఉప రాష్ట్రపతి ఎన్డీఎ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. బీజేపీ పార్టీమెంటరీ పార్టీ బోర్డు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ఈ పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నిక లాంఛనమే! పెద్దగా అనుభవం లేకుండానే పెద్దల సభ రాజ్యసభకు అధ్యక్షత వహించబోతున్నారు. భారత ఉప రాష్ట్రపతి కాబోతున్నారు. సౌమ్యుడు, విద్యావేత్త, విలక్షణ వ్యక్తిత్వం వెరసి అదృష్టం ఆయన్ని వరించింది. తమిళనాడు నుంచి ఈసారి ఉప రాష్ట్రపతి గా రాధాకృష్ణన్ రాబోతున్నారు.
– డా. మహ్మద్ రఫీ