Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పాడుబడ్డ బావిలో శవాలు: అప్పుడేం జరిగిందంటే…?

సంచ‌ల‌నం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట పాడుబడ్డబావి కేసులో వ‌రంగ‌ల్ జిల్లా సెష‌న్స్ కోర్టు బుధ‌వారం తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన సంజ‌య్ కుమార్ యాద‌వ్ ‌(24) ను కోర్టు హంతకునిగా తేల్చింది. దోషికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా ఒకటో అదనపు కోర్టు న్యాయ‌మూర్తి జ‌య‌కుమార్ తీర్పు చెప్పారు. వాస్తవానికి ఈ కేసును వరంగల్ పోలీసులు
కాల్ డేటా ఆధారంగానే ఛేదించడం గమనార్హం. అప్పటి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ ఘటన వెలుగు చూసిన సందర్భంగా మీడియాకు వెల్లడించిన కథనం ప్రకారం….

వరంగల్ నగర శివార్లలోని గొర్రెకుంటలో గన్నీ బ్యాగులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన సంజ‌య్‌ కుమార్‌ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31) తోనూ పరిచయం కలిగింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజ‌య్‌ చేరువయ్యాడు. అనంతరం గీసుగొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సంజయ్ సహజీవనం చేశాడు. తన అక్క కుమార్తెతో కూడా నిందితుడు సన్నిహితంగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ను నిలదీసింది. అనేకసార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజ‌య్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండకు చేరుకున్నాడు. తన అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గత మే 16 నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గన్నీ బ్యాగుల తయారీ కేంద్రాన్ని సందర్శించేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను నిశితంగా పరిశీలించాడు.

మే 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజుగా తెలుసుకుని ఆ రోజే చంపాలని సంజయ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. పథకం అమలులో భాగంగా మే 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిందితుడు నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో గల ఎండీ మక్సూద్ ‌(50), ఆయన భార్య నిషా (45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3), షాబాద్‌ (22), సోహైల్ ‌(20), బీహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్ ‌(22), శ్రీరామ్ (20), వరంగల్‌ వాసి షకీల్ లను గోదాం పక్కనే గల పాడుబడ్డ బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.

కాగా సంచలనాత్మకమైన ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేసిన గీసుగొండ పోలీసులను ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అభినందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అవసరమైన అన్ని సాక్ష్యాలను సేకరించి, కోర్టులో ప్రవేశపెట్టి, నిందితుడికి ఉరి శిక్ష పడేలా చేసిన గీసుకొండ పోలీసులను, సీఐ శివరామయ్యను సీపీ ప్రశంసించారు.

Popular Articles