భద్రాద్రి రామాలయంలో అన్యమత ప్రచార వివాదం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి శేష వస్త్రాల విక్రయశాలలో అన్య మత ప్రచారంతో కూడిన కవర్లలో విక్రయాలు జరిగిన ఉదంతం ఆదివారం కలకలం రేపింది. స్వామివారి శేష వస్త్రాలు కొనుగోలు చేసిన గుంటూరుకు చెందిన భక్తుడి ఫిర్యాదుతో ఈ అన్యమత ప్రచారపు అంశం వెలుగులోకి వచ్చింది. శేష వస్త్రాల విక్రయశాలలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేసిన భక్తుడికి అన్యమత ప్రచార వ్యాప్తితో కూడిన వాక్యాలు ముద్రించి ఉన్న కవర్లలో షాపు నిర్వాహకులు వస్త్రాలను అందచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై గుంటూరుకు చెందిన జనార్ధన్ అనే భక్తుడు ఆలయ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా ఆలయ ప్రాంగణంలో అన్యమత ప్రచారంపై ఆలయ అధికారులు అత్యంత గోప్యంగా విచారణ సాగిస్తుండడం గమనార్హం.

