కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్ డే వేడుకలు తీవ్ర వివాదానికి దారి తీసి ఖమ్మం జిల్లా బీజేపీలో రాజకీయ కాక రేపుతోంది. ఈ ఘటన చిలికి చిలికి రాష్ట్ర అధ్యక్షునికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందంటే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు ప్రాంతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్న ‘అన్న క్యాంటీన్’లో సంజయ్ బర్త్ డే వేడుకలు వివాదానికి దారి తీయడం గమనార్హం. అసలు విషయంలోకి వెడితే..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు నిన్న బీజేపీ శ్రేణులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా బీజేపీ నాయకత్వం బండి సంజయ్ బర్త్ డే వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించతలపెట్టింది. అయితే ఈ అన్నదాన కార్యక్రమానికి వేదికగా ఖమ్మం నగరంలోని కాల్వొడ్డులో గల ‘అన్న క్యాంటీన్’ను బీజేపీ జిల్లా నాయకత్వం ఎంచుకోవడం గమనార్హం.

అన్న క్యాంటీన్ లో అన్నదానం జరుగుతుండగా అక్కడికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షడు నెల్లూరి కోటేశ్వర్ రావు సహా మరికొందరు నాయకులు చేసిన నినాదాలే ఇప్పుడు పార్టీలో చిచ్చుకు కారణమయ్యాయి. ‘నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రామచందర్ రావు, బండి సంజయ్ ల పేర్లను ప్రస్తావిస్తూ వారి నాయకత్వాలు వర్ధిల్లాలని అన్న క్యాంటీన్ లో బీజేపీ నాయకులు నినదించారు. పనిలో పనిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు ‘జై ఎన్టీఆర్’ అంటూ నినదించారు.

అయితే తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఏం సంబంధమని, బండి సంజయ్ బర్త్ డే వేడుకలు నిర్వహించేందుకు అన్న క్యాంటీన్ ను వేదికగా ఎంచుకోవడమేందని ప్రశ్నిస్తూ ఆ పార్టీ నాయకత్వానికి బీజేపీ ఖమ్మం జిల్లా వర్గాలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఘటన ఖమ్మం బీజేపీ నాయకుల్లో, కేడర్ లో తీవ్ర వివాదమై కూర్చుంది. కాగా బండి సంజయ్ బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్ లో నిర్వహించిన అన్నదానం ఖర్చును బీజేపీ నాయకులే భరించారని క్యాంటీన్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.