Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మంత్రులా..! మజాకానా!? ‘పదవీ ప్రజాస్వామ్యం’ మరి!

పదవులు ‘పవర్’ను తీసుకువస్తాయి. పవర్ లో ఉన్నపుడు పొలిటీషియన్లు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్ర వివాదాస్పదమై పదవులకూ ప్రమాదాన్ని తీసుకురావచ్చు. నోటిదురదతో పదవులు కోల్పోయిన రాజకీయ నాయకులు దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనూ చాలా మంది ఉన్నారు. కీలక పదవుల్లో ఉన్నపుడు పొలిటికల్ లీడర్లు ఆచి తూచి మాట్లాడాలని పార్టీలకు చెందిన పెద్దలు పదే పదే హితవు చెబుతుంటారు. కానీ ఈ హితవును పెద్దగా పట్టించుకోని కొందరు నాయకులు చేసే వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంటాయి. ‘పైసల కోసం వీళ్లు ఇట్ల మాట్లాడుతున్నరా ఏంది?’ అనే అనుమానాలు కూడా ప్రజనీకంలో తలెత్తుతుంటాయి. ఎందుకంటే కొందరు నాయకులు చేేసే వ్యాఖ్యలు అంతర్లీనంగానో, నర్మగర్భంగానే అవే భావనలను స్ఫురింజేస్తుంటాయి. విషయాన్ని తెలుసుకోనే ముందు కొద్దిరోజులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెడితే..

గత మే16వ తేదీన కాబోలు.. వరంగల్ తూర్పునుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ ఏమన్నారో గుర్తుందిగా? వరంగల్ నగరంలోని కృష్ణకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ. 5.00 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించతలపెట్టిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ, తన వద్దకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయని, అటవీ శాఖ మంత్రిని కావడంతో తన అనుమతులకై వివిధ ఫైల్స్ వస్తాయని చెప్పారు. అయితే ఇటువంటి ఫైళ్లు క్లియర్ చేసేముందు మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుంటారని, కానీ తాను మాత్రం అలా చేయనని చెప్పారు. తనకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అరబిందో ఫార్మా ప్రతినిధులతో చెప్పానని, స్కూల్ డెవలప్మెంట్ మాత్రం చేయాలని తాను కోరానని సురేఖ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. విపక్ష బీఆర్ఎస్ పార్టీకి విమర్శనాస్త్రం కూడా లభించింది. ‘అగో.. మంత్రులు డబ్బు తీసుకుంటున్నట్లు కొండా సురేఖే చెప్పారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?’ అనే తరహాలో బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, గత ప్రభుత్వంలో అలా జరిగిందనే ఉద్ధేశంతో మాత్రమే తాను మాట్లాడానని సురేఖ వివరణ ఇచ్చుకున్నారనేది వేరే విషయం.

ఈ వివాదం సద్దుమణిగిందో లేదో బహుషా గత జూన్ 20వ తేదీన కావచ్చు. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తన సతీమణి, దేవాదాయ మంత్రి కొండా సురేఖకుకు సంబంధించిన మంత్రిత్వ శాఖల్లో కనీస ఆదాయం రావడం లేదని, ఆమె ఖర్చులకు తానే నెలకు రూ.5 లక్షలు ఉల్టా ఇస్తున్నట్లు కొండా మురళి వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారి తీసింది. ఇది చాలదన్నట్లు తాజా పరిణామాల్లో పార్టీకి చెందిన సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డిపైనా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనా, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిపైనా, మాజీ మంత్రి కడియం శ్రీహరిపైనా తీవ్ర విమర్శలు చేస్తూ కొండా మురళి గత నెలాఖరున కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మెన్ మల్లు రవికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

కరీంనగర్ లో మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం మాట్లాడినప్పటి చిత్రం

పార్టీలో ఓవైపు కొండా మురళి దంపతుల వ్యాఖ్యలు, ఆరోపణల వంటి అంశాల్లో భిన్న వార్తా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే కొత్త మంత్రి వాకిటి శ్రీహరి నిన్న కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ‘ఆగమాగం’ పరిస్థితికి అద్దం పడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో పూర్తిగా నాశనమైపోయిన ఐదు శాఖలను తనకు ఇచ్చారని, అవి ఆగమాగమైన శాఖలని మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘గొర్రెలు బర్రెలు ఇచ్చారు, చేపలు, రొయ్యలు ఇచ్చారు.. నేనేం చేసుకోవాలి?’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు కొత్తగా మంత్రి పదవి వచ్చిన ఆనందం లేదని, అదృష్టమో, దురదృష్టమో కూడా తెలియడం లేదని, పర్యాటక, సాంస్కృతిక శాఖలోని యువజన సర్వీసుల శాఖ కట్ చేసి తనకు ఇచ్చారని, తానేం చేయాలని, తననేం చేసుకోమంటారని వాకిటి శ్రీహరి ప్రశ్నించారు.

మొత్తంగా వేర్వేరు సందర్భాల్లో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీశాయి. కొండా మురళి దంపతులకు రాజకీయంగా అపార అనుభవం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో దశాబ్ధాల రాజకీయ నేపథ్యమూ ఉంది. కొండా దంపతులు ఏది మాట్లాడినా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చే అవుతుంది. ఇదే దశలో మహబూబ్ నగర్ జిల్లాలో మూడు దశాబ్దాల రాజకీయ అనుభవ గల వాకిటి శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మక్తల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ఓడించిన శ్రీహరి తొలిసారి శాసనసభలోకి అడుగు పెట్టినప్పటికీ ఏకంగా మంత్రి కావడం గమనార్హం.

వరంగల్ జిల్లా రాజకీయాల్లో తాము చవి చూస్తున్న పరిణామాలపై కొండా దంపతులు, తనకు కేటాయించిన శాఖల పట్ల మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. ఆయా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటువంటి అంశాల్లో ఏదేని సమస్య ఉంటే నేరుగా తనతోనే చర్చించవచ్చని, పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించవద్దని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నా సరే, అటు కొండా దంపతులు, ఇటు వాకిటి శ్రీహరి వంటి కొత్త మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై రాజకీయ పరిశీలకులు చెబుతున్నదేమిటంటే.. ‘కాంగ్రెస్ పార్టీలో అంతే.. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడొచ్చు స్వేచ్ఛగా.. పదవి తెచ్చిన అతి ప్రజాస్వామ్మం సాక్షిగా..!’.

Popular Articles