హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారని అధికారిక ప్రకటన పేర్కొంది. ఆ ప్రకటనలోని వివరాల ప్రకారం..
ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.
24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)
- శ్రీమతి వందన బరువా : +91 9871999044
- సీహెచ్. చక్రవర్తి : +91 9958322143
- జావేద్ హుస్సేన్ : 9910014749
- రక్షిత్ నాయక్ : +91 9643723157
మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆ ప్రకటన స్పష్టం చేసింది.

