‘సప్త సముద్రాలు ఈది పిల్ల కాలువలో పడ్డట్లు’ అనే సామెత నిర్వచనం తెలుసు కదా! కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే పూర్వ టీవీ యాంకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. ఇటీవలి కాలంలో ఈ ఎమ్మెల్సీ కొన్ని సామాజిక వర్గాలను అత్యంత ద్వేషంతో కూడిన వ్యాఖ్యలతో దూషిస్తున్నపుడు ‘సమీక్ష’తో కూడిన కథనం రాసేందుకు ఉద్యుక్తమైన పరిస్థితుల్లో శ్రేయోభిలాషి అయిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి సున్నితంగా వారించారు. ‘నువ్వు ఎంత సీనియర్ జర్నలిస్టువైనప్పటికీ, ఈ అంశంలో నువ్వు రాయాల్సిన అవసరం లేదు. నీ పేరు చివరన ‘రెడ్డి’ అనే రెండక్షరాలు ఉన్నందున ఎమ్మెల్సీ నవీన్ భాషా సంస్కారంపై నువ్వు రాయకపోవమే బెటర్’ అని నా కలం స్పీడ్ కు బ్రేక్ వేశారనే చెప్పాలి. తీన్మార్ మల్లన్న తనకు తానుగానే ఇరుక్కుంటాడని ఆ ప్రభుత్వ అధికారి కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట ప్రస్తుతం నిజమైందనే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన పరిణామాల్లో తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిపై వృత్తి ధర్మ కథనం అనివార్యమైంది. ఇక అసలు విషయంలోకి వెడితే..

ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ‘తీన్మార్’ వార్తల్లో నెత్తికి రుమాలు చుట్టుకుని, భుజాన గొంగడి వేసుకుని యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించిన నవీన్@మల్లన్న ఆ తర్వాత ఓ యూ ట్యూబ్ ను ప్రారంభించి తనదైన శైలి భాషా సంస్కారంతో చాలా పాపులర్ అయ్యాడు. సాక్షాత్తూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ‘కాక’ అంటూ, రాజకీయ పదవుల్లో గల సీఎం కేసీఆర్ సంతానాన్ని డ్రామారావు, తైతక్క అంటూ తన యూట్యూబ్ లైవ్ ప్రసారాల్లో గొంతు చించుకున్న నవీన్ ఆ తర్వాత అనేక కేసుల్లో నిందితునిగానూ మారాడు. చివరికి తన ఆఫీసుపై దాడులు జరిగిన పరిణామాలను కూడా చవి చూశాడు. రాజకీయ అవతారం ఎత్తిన నవీన్ అనేక ప్రయత్నాల ద్వారా చివరికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. బీఆర్ఎస్ నేతలను తన పరుష వ్యాఖ్యలతో ఘాటైన విమర్శలు చేసిన నవీన్ ను కాంగ్రెస్ పార్టీ చేరదీసి పెద్దపీట వేసిన ఫలితాన్ని ఆ పార్టీ ప్రస్తుతం చవి చూస్తున్నదనే చెప్పవచ్చు.
‘ఒక్క చాయ్ పైసలన్న.. మీరొక్కపూట చాయ్ తాగుతరు చూసినరన్న..ఆ చాయ్ కి పెట్టే పది రూపాల్ నాకు దానం చేయండన్నా’ అంటూ సోషల్ మీడియా ద్వారా దీనంగా అడుక్కున్న మల్లన్న అనబడే నవీన్ నేడు హెలీకాప్టర్లలో తిరిగే ఆర్థిక స్థితికి ఎదగడం ఓరకంగా అతని సక్సెస్ స్టోరీనే కావచ్చు. హెలీకాప్టర్లలో తిరగడమే కాదు, అవసరమైతే కొనుక్కోగలమని క్లియర్ గానే చెబుతున్న మల్లన్న ఫైనాన్స్ పొజిషన్ పై ఒకప్పుడు తనవద్ద పనిచేసిన వ్యక్తులే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారనేది వేరే విషయం. లక్షలాది మంది సబ్ స్క్రైబర్లు గల తన యూ ట్యూబ్ ఛానల్ లో లైవ్ కార్యక్రమాల్లో తనకు నచ్చిన, తాను ఎంపిక చేసుకున్న నాయకులను పిలిపించుకుని కీర్తించడంలోనే కాదు, నోటికొచ్చినట్లు దూషించడంలోనూ మల్లన్నది ప్రత్యేక శైలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అక్షరాలా ఇదే అంశం రుజువైంది కూడా. మల్లన్న ప్రత్యక్ష ప్రసార ‘భజన’కు ఉప్పొంగిపోయి రెండుచేతులు జోడించి నమస్కరిస్తూ దరహాసం చేసిన పొంగులేటి ఆ తర్వాత అదే మల్లన్న నోటి నుంచి ఎదుర్కున్న ‘తీవ్ర వ్యాఖ్య’ను ఇక్కడ ప్రస్తావించడానికి ప్రొఫెషనల్ జర్నలిజపు భాష అడ్డుగా నిలుస్తోంది.

ఇటువంటి అనేక పరిణామాల్లో నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నించిన చింతపండు నవీన్ అలియాస్ మల్లన్నను ఎమ్మెల్సీగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మల్లన్న గెలుపుకోసం ఆర్థికంగా సహాయపడినట్లు ప్రచారంలో గల పొంగులేటి శ్రీనివాస‘రెడ్డి’తోపాటు ఇతరత్రా చేయూతనందించిన కోమటిరెడ్డి వెంకట‘రెడ్డి’, కుందూరు జానా‘రెడ్డి’, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‘రెడ్డి’లే కాదు, మల్లన్న గెలవాలని కష్టపడిన సీతక్క వంటి లీడర్లు, ఎమ్మెల్సీ టిక్కెట్టిచ్చి ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లుగానే చెప్పవచ్చు. ఎందుకంటే మల్లన్న ఏకంగా ప్రభుత్వానికే సవాల్ విసిరాడు. తనకు రాజకీయ నీడనిచ్చిన, తాను కూర్చున్న కొమ్మనే నిందిస్తున్నాడు. కులగణన సర్వేను దొంగ సర్వేగా అభివర్ణిస్తున్నాడు. తప్పుడు సర్వేగా చెబుతున్నాడు. తన యూ ట్యూబ్ ఛానల్ లైవ్ కార్యక్రమంలో ఏకంగా కులగణన సర్వే ప్రతినే తగులబెట్టాడు. ‘మీ నిర్వాకమేంటో మీ ఎమ్మెల్సీనే చెబుతున్నాడు’ అంటూ విపక్ష నేత కేటీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే దునుమాడిన స్థితికి నిస్సంకోచంగా మల్లన్నే కారకుడనే వాదన ఉండనే ఉంది.

‘రెడ్ల’ను తిట్టాడనో, కోమటి లాయర్ ను దూషించాడనో విషయాన్ని వదిలేస్తే ఇప్పుడు ఏకంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ తీరునే ఎమ్మెల్సీ మల్లన్న నిందిస్తున్నాడు. ఈ పరిణామం పాలక పార్టీకి ఇబ్బందికరమే. ఫలితంగానే పీసీసీ క్రమశిక్షణా సంఘం మల్లన్న అనబడే ఎమ్మెల్సీ నవీన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నువ్వు మాట్లాడిన మాటలకు, నీ వ్యవహారశైలిపై వివరణ ఇవ్వాలంటూ సంజాయిషీ కోరింది. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశానికి కూడా మల్లన్న డుమ్మా కొట్టాడు. అంటే ప్రభుత్వాన్నే కాదు, పార్టీని కూడా ఇతను ధిక్కిరిస్తున్నట్టేనా? పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షేంచింది లేదని సీఎల్పీ వార్నింగ్ ఇస్తోంది. తాజా పరిణామాల్లో చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న ఘాటుగానే స్పందిస్తున్నాడు. తనకు ఇంకా షోకాజ్ నోటీసు అందలేదని, అందిందనే అనుకుంటానని కొద్దిసేపటి క్రితం తన యూ ట్యూబ్ ఛానల్ లైవ్ లో స్పందించాడు. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, బీసీల తరపు కొట్లాడుతున్న తనకు నోటీసు ఇచ్చినందుకు మల్లన్నతో ఎందుకు పెట్టున్నామని రెండు కాళ్ల సందున తలకాయ పెట్టుకుని ఏడ్చేరోజు తప్పక వస్తుందని వ్యాఖ్యానించడం, బీసీల షోకాజ్ నోటీస్ ఎన్నికల్లో ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. కుల గణన సర్వేపై తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్సీ పునరుద్ఘాటించడం విశేషం.

అయితే రాజకీయ ఎజెండా లేకుండానే మల్లన్న ఇలా ‘బరి’ తెగించి వ్యవహరిస్తున్నాడా? అనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా రేకెత్తుతున్నాయి. తాను భయపడే ప్రసక్తే లేదని చెబుతున్న మల్లన్న కోరుకున్న చర్యకే కాంగ్రెస్ పార్టీ సిద్దపడుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా పరిశీలించినపుడు ఓ ప్రభుత్వ అధికారి అంచనా ప్రకారం ఎమ్మెల్సీ మల్లన్న ప్రస్తుతం తనకు తానే ఇరుక్కున్నాడా లేక వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడా? అనే ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది. ఏదేని సామాజిక వర్గాన్ని దూషించడం ద్వారా పెద్ద నాయకుడినవుతానని మల్లన్న భావించాడో లేదో కానీ, తన ‘స్పీడ్’ ద్వారా ప్రభుత్వాన్నే సవాల్ చేసి షోకాజ్ నోటీస్ అందుకున్న స్థితిని ఎమ్మెల్సీ నవీన్ ఎదుర్కుంటుండడం గమనార్హం. టీవీ యాంకర్ నుంచి జీవితాన్ని ప్రారంభించి రాజకీయంగా సప్తసముద్రం వంటి కేసీఆర్ వంటి నాయకుడిపై యూ ట్యూబ్ లో నోరేసుకుని దశలవారీగా ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన చింతపండు నవీన్ ఇప్పుడు రాజకీయంగా తప్పటడుగు వేసి ‘పిల్లకాల్వ’లో పడినట్లేనా? ఇదీ చర్చనీయాంశ ప్రశ్న. ఎందుకంటే ధిక్కరంపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసి ప్రక్రియ ప్రకారం ముందు షోకాజ్ నోటీసులిచ్చి, దశలవారీగా సస్పెన్షన్, బహిష్కరణ వంటి అస్త్రాలను ఉపయోగిస్తుంది. ఇటువంటి అస్త్రాలను చవి చూసిన అనేక మంది ప్రముఖ నాయకులు రాజకీయంగా అడ్రస్ లేకుండాపోయారు. ఇటువంటి లీడరల్లో జాతీయ నాయకులే కాదు, తెలంగాణా ప్రాంత నేతలూ పలువురు ఉన్నారు.
-ఎడమ సమ్మిరెడ్డి