హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల ఆధిక్యతతో నవీన్ యాదవ్ గెలుపొందారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ గెలుపును ధ్రువీకరిస్తూ రిటర్నిగ్ అధికారి సర్టిఫికెట్ అందజేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు లభించాయి. బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యతను ప్రదర్శించారు. ఈనెల 11వ తేదీన ఇక్కడ ఉప ఎన్నికల పోలింగ్ జరగ్గా, శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఉప ఎన్నికల్లో తన గెలుపుపై నవీన్ యాదవ్ మాట్లాడుతూ, జూబ్లీ హిల్స్ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ప్రజలు ఓట్లు వేశారని, ఎన్నికలు ముగిశాయని, అందరం కలిసి జూబ్లీ హిల్స్ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని నవీన్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేశారని, వాళ్లు చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదన్నారు. తన గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూసిందని, ఇటువంటి దుష్ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని అన్నారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని, తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, నియోజకవర్గ సమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా’నని నవీన్ యాదవ్ తెలిపారు.

కేటీఆర్ రియాక్షన్:
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈమేరకు మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్‌ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానిక నాయకత్వం అద్భుతంగా కష్టపడిందన్నారు. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పోరాడారని, ఆమెకు అభినందనలు చెబుతూ, బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని, నైతిక విజయం తనదేనని ఆమె స్పష్టం అన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన ‘ఎక్స్’ ఖాతాలో ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

