ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈమేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ ఆదేశపు ప్రతిని వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.
షాకాజ్ నోటీసుకు ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అయితే తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై మల్లన్న ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఈ పరిణామాల్లో తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి విడుదల చేసిన లేఖను విడుదల చేశారు.
ముందే చెప్పిన ‘సమీక్ష’ కథనం చదవండి:
కాగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్నపై తీసుకున్న చర్యపై ఆయన స్పందిస్తూ, కుల గణన పత్రాలు దహనం చేయడాన్ని తీవ్రంగా పరిగణించామని చెప్పారు. షోకాజ్ నోటీసుకు సైతం మల్లన్న స్పందించలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా చర్యలు తప్పవని మహేష్ కుమార్ హెచ్చరించారు.


