ఖమ్మం: ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ‘రాజకీయం’లో సంచలన, చర్చనీయాంశ ఘటన ఇది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం స్వంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ అంశం స్పష్టం కానుంది. పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో ఈ పరిణామం చోటు చేసుకునే దిశగా రాజకీయ పావులు కదలడం ఆసక్తికరం.
ఎందుకంటే సీపీఎం పార్టీకి చెందిన కొందరి చేతుల్లో 2022 ఆగస్టు 15వ తేదీన దారుణ హత్యకు గురైన తమ్మినేని క్రిష్టయ్య భార్య మంగతాయి, ఆయన కుమారుడు నవీన్ లు 14,15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం కావడం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకుడి హోదాలో హత్యకు గురైన తమ్మినేని కుటుంబం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంది. సీపీఎం అగ్రనేత తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన తెల్దారుపల్లిలో మూడు మున్సిపల్ వార్డులు ఉండగా, అందులో రెండు వార్డులు పూర్తిగా అదే గ్రామం పరిధిలోని ఓటర్లతో కూడుకుని ఉన్నాయి. మరో వార్డు పక్కనే గల మద్దులపల్లి ఓటర్లతో మిళితమై ఉంది.

అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ్మినేని క్రిష్ణయ్య భార్య మంగతాయి, కుమారుడు నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సీపీఎం నాయకత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వార్డులో మాత్రం సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిసింది. అయితే తమ్మినేని క్రిష్టయ్య భార్య మంగతాయి, కుమారుడు నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం కావడానికి, సీపీఎం పార్టీ కూడా అంగీకరించడం వెనుక రాజకీయ ఒప్పందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ ఘటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update:
‘సమీక్ష’ కథనం నిజమైంది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ‘సమీక్ష’ న్యూస్ కథనపు సమాచారం ధ్రువపడుతూ ఏదులాపురం 15వ వార్డు కౌన్సిలర్ గా తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో సీపీఎం అభ్యర్థి, తమ్మినేని కోటేశ్వర్ రావు సతీమణి విజయలక్ష్మి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా 14వ వార్డులో గల బీజేపీ అభ్యర్థి కూడా తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే సీపీఎం అభ్యర్థి వెంకన్న మాత్రం ఇక్కడ తన నామినేషన్ ను ఉపసంహరించుకోలేదు. దీంతో ఇక్కడ పోటీ అనివార్యమైంది.

