తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్లుగానే కనిపిస్తోంది. వచ్చే వారంలోగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఉగాది పండుగకు ముందుగాని, తర్వాతగాని రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముండగా, కేబినెట్ లోకి మరో నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు చేరే అవకాశముంది.
గత రాత్రి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూర్పు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. మంత్రి పదవుల రేసులో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల జిల్లాకు చెందిన గడ్డం వివేక్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురిని తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం నలుగురికే అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ఆరింటినీ భర్తీ చేస్తే మాత్రం ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడ చోటు దక్కవచ్చంటున్నారు. ఇదే దశలో పలువురి శాఖల్లో మార్పులు జరగవచ్చని, ఓ మంత్రికి ఉద్వాసన సైతం పలకవచ్చని కూడా తాజా వార్తల సారాంశం. మొత్తంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొందరు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా కొత్త మంత్రుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.