సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలోె నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చండ్రుగొండకు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారుే. ఆ తర్వాత 2.35 నుంచి 2.50 గంటల వరకు బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2.50 నుంచి 3.05 గంటల వరకు ఇక్కడ నిర్మించిన పైలాన్ ను ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.25 గంటలకు చండ్రుగొండ హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి భద్రాద్రి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఢిల్లీ పర్యటనకు వెడుతుండడం విశేషం. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనకు వెడుతున్నట్లు సమాచారం. భారీ వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టాలతోపాటు యూరియా కొరత సమస్యపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల కేంద్ర మంత్రులను కలిసి నివేదిక సమర్పించనున్నారు. ఆస్తి, పంట నష్టాలకు కేంద్ర సాయం అందించాలని, యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ ను, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ పర్యటనను విజయవంతం చేసే కార్యక్రమాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
