సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో భద్రాచలం బయలుదేరనున్నారు. భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా సీఎం రానున్నారు. మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈమేరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది.
ఈ ఉదయం 8.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా పయనించి ఉదయం 10.00 గంటలకు భద్రాచలం చేరుకోనున్నారు. ఆ తర్వాత ఓ 20 నిమిషాలపాటు ఐటీసీ గెస్ట్ హౌజ్ లో సేద తీరి ఉదయం 10.40 నుంచి 11 గంటల వరకు భద్రాచలం ఆలయంలో రాములవారిని దర్శించుకోనున్నారు.
టెంపుల్ నుంచి 11.10 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకుని పగలు 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. ఆ తర్వాత 12.35 నుంచి 1.10 గంటల వరకు సారపాకలోని సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట భోజనం చేస్తారు. అనంతరం 2 గంటల వరకు ఐటీసీ గెస్ట్ హౌజ్ లో విశ్రాంతి తీసుకుని తిరిగి హెలీకాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ లోని తన నివాాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రాద్రి జిల్లా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.

