రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదన్నారు. అప్పు పుట్టడం లేదన్నారు. అణా పైసా కూడా ఎవడు ఇస్తలేడన్నారు. ఎవరినైనా కలవడానికి వెడితే తెలంగాణా రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూస్తున్నట్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని, వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతడేమోనన్నట్లుగా.. ఆ పరిస్థితి ఉంది దేశం ముందర.. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేవాడిని.. అప్పు పుట్టట్లేదు.. ఎవ్వడు బజార్ల నమ్మడం లేదు..’ అని సీఎం అన్నారు. స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారమని, ఉన్నంతలో సంసారాన్ని గౌరవంగా నడిపితే బజార్ల ఎవరైనా నమ్ముతారని, వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబ పరువు బజారున పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘాల నాయకులు ఆలోచించాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరువును బజారున పడేయవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఓ కుటుంబం ఆర్థికంగా ఛిన్నాభిన్నమై దివాళా తీస్తే ఎలా ఉంటుందో, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. పదకొండు శాతానికి ఎవడైనా అప్పులు తీసుకువస్తడా? 10 రూపాయల మిత్తికి డెయిలీ ఫైనాన్స్ తెచ్చుకున్న తరహాలో, అంతకంటే అధ్వాన్నంగా ఎక్కువకు అప్పులు తెచ్చి, మీ చావు మీరు చావండనే తరహాలో హ్యాపీగా ఫాం హౌజ్ లో దుప్పటి కప్పుకుని పడుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు నెలలకోసారి బయటకొచ్చి తిట్టి పోతాడని అన్నారు. రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి కేసీఆర్ కారకుడని ఆయన పేరు ప్రస్తావించకుండానే వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంక వివరాలను చెబుతూ తనను కోసినా కూడా రాష్ట్ర ఆదాయం రూ. 18,500 కోట్లకు మించి లేదన్నారు. ప్రతీ నెల 4 వేల కోట్ల ఆదాయ వ్యత్యాసం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు ఆలోచించాలని, ఆదాయం లేనప్పుడు, పరిస్థితి బాగా లేనప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరన్నారు. ‘ఏం చేస్తరయా మీరు నన్ను చెప్పుండ్రి.. నన్ను కోసుకుని తింటరా? వండుకుని తింటరా? ఆదాయాన్ని ఎట్ల పంచుదమో చెప్పుండ్రి.. ఏది ఆపుదమో చెప్పుండ్రి. బోనస్ లు, జీతాలు తీసుకుంటమని ప్రజలకు చెప్పండి.. బహిరంగ సభ ఏర్పాటు చేస్త.. ఉద్యోగ సంఘాలు చెప్పాలి..పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతమని ప్రజలకు చెప్పండి. ఇవేవీ చేయకుండా కొత్త కోరికలు నెరవేరవు, వ్యవస్థ కుప్పకూలుతుంది. ధరలు పెంచుకుండా, ఉన్న పథకాలు ఆపకుండా మీ కోరికలు తీర్చేలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాను చెబుతున్న ఆర్థిక లెక్కల్లో ఏవేని సందేహాలు ఉంటే ఉద్యోగ సంఘాలు తెలుసుకోవచ్చన్నారు. ఉద్యోగ సంఘాల నిరసనలు, ధర్నాలు, సమరంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తింటే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రారని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసి అస్థిర పరిచేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రాజకీయ నాయకులు చేతుల్లో పావులుగా మారవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలను కోరారు. తమ కోర్కెల సాధనకోసం ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్న పరిణామాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.