Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

టీడీపీ కేడర్ కు సీఎం రేవంత్ సంచలన పిలుపు

ఖమ్మం: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విషయంలలో అనుసరించాల్సిన వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు, గద్దెలు కూలిస్తేనే దివంగత ఎన్టీఆర్ కు నిజమైన నివాళిగా వ్యాఖ్యానించారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఉండరాదని కక్ష గట్టిన గులాబీ పార్టీ జెండా గద్దెలను గ్రామాల్లో కూల్చాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావును ఇదే సభలో కీర్తించారు. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.

పేదల సంక్షేమానికి పాటుపడడంలో ఇద్దరు నాయకులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, అందులో ఒకరు దివంగత ఎన్టీఆర్ కాగా, మరొకరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని రేవంత్ అన్నారు. రూ. 2 కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపిన ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుుందన్నారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్ ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వంలో సన్నబియ్యం అందించనపుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళిగా రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణాలో ఇంకా పేదలెవరైనా మిగిలి ఉంటే వారికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.

ఖమ్మంలో సీఎం సభలో తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల దృశ్యం

తెలంగాణాలో ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారని, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ ఉండరాదని, ఆ పార్టీ నాయత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టినపుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించినవాళ్లమవుతామని అన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని, బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు రేవంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Popular Articles