తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన, తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అవుతుందని ఆయన అన్నారు. వర్సిటీలో విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, రీడిండ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
ఓయూను ఒక అద్బుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా శాఖ నిపుణలతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దని, ఈ వర్సిటీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రమాణాలతో అద్బుతమైన వర్సిటీగా రూపొందించడానికి ఏం కావాలో అడగాలని కోరుతూ, రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఈ యూనివర్సిటీని గాలికొదిలేయడం సరికాదన్నారు.

వర్సిటీలు ఉద్యోగులను, అధికారులను ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాసంపత్తిని అందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలన్నారు. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు