Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యత ప్రభుత్వానిదే: సీఎం రేవంత్

కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ప్రాంతంలో పరిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ (DrMMSESUT) ను ఇక్కడ నెలకొల్పామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వంలోని ఆయువుపట్టు లాంటి శాఖలన్నీ ఖమ్మం జిల్లా మంత్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు.

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆరు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొట్టమొదటగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందన్న విషయాలను గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్షను ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నెరవేర్చిన నేపథ్యంలో యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినట్టు వివరించారు. దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపించిన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ప్రశంసించారు.

దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం విద్య, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో విద్య, నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Popular Articles