Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తరు మరి..! మాస్ లైన్ నేతలతో సీఎం సరదా సంభాషణ

సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకుల మధ్య మంగళవారం సరదా సంభాషణ జరిగింది. ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు కేజీ రాంచందర్, కెచ్చెల రంగారెడ్డి, కె. రమ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఆర్టీసీ కార్మికుల ఉద్యమం సందర్భంగా వేలు తెగిన ఘటనపై సీఎం ఆరా తీసి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదే సందర్భంగా ‘మీ మంత్రులు జిల్లాa పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు..’ అని రంగారావు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, అట్ల ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అని సీఎం ప్రశ్నించారు. మంత్రులు, డిప్యూటీ సీఎం, సీఎం వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో తమనే కాదని, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారని రంగారావు వివరించగా, అదేదో చూడండి.. అని సీఎం రేవంత్ రెడ్డి పక్కనే గల ఓ ముఖ్య పోలీసు అధికారికి సూచించారు.

మాస్ లైన్ పార్టీ నాయకులను సీఎంకు పరిచయం చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

ఆ తర్వాత రంగారావు తన సంభాషణను కొనసాగిస్తూ, ‘ప్రజా సమస్యలపై మీరు కాస్త దృష్టి సారించాలి’ అని సూచించగా, ‘మురికి కాల్వకు కూడా ముఖ్యమంత్రినే అడుగుతున్నారు’ అని సీఎం బదులిచ్చారు. ఎన్నికలకు ముందు, వివిధ సభల్లో, సమావేశాల్లో మురికి కాల్వ నుంచి ముఖ్యమైన అనేక అంశాలపై కూడా మీరు హామీలు ఇస్తుంటారు కదా..?’ అని రంగారావు గుర్తు చేయగా, ‘అందుకే మా పర్యటనల సందర్భంగా మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు మరి’ అని సీఎం రేవంత్ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్నవారందరు కూడా నవ్వులు పూయించారు.

సీఎం రేవంత్ రెడ్డి, మాస్ లైన్ పార్టీ నాయకుల మధ్య సంభాషణ చిత్రం

కాగా హామీల అమలు, పోలీసు నిర్బంధం తదితర 27 అంశాలపై మాస్ లైన్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ అనుసరించిన మతోన్మాద, ఫాసిస్టు ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణా ప్రజలు, అన్ని పక్షాలు, ప్రజాస్వామికవాదులు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలతో అధికారం దక్కిందని, ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే అమలయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ సంపూర్ణంగా జరగాలని మాస్ లైన్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు.

Popular Articles