ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నానని, తమ డిమాండ్ ను అమోదిస్తారా? లేక మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల ధర్నాలో సీఎం మాట్లాడారు.
తమ నాయకుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసి, 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని రేవంత్ అన్నారు. ‘అయ్యా నరేంద్ర మోదీ గారూ.. మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేం అడగలేదు… మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీరు అడగలేదు.. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డపై మా బలహీన వర్గాల సోదరులకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని అడిగితే …మీ గుజరాత్ కు వచ్చిన కడుపుమంట ఏంటి? మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిందా.. మీ బంధం తెగిపోయిందా?’ అని సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ మోడల్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించబోతోందని, ఆ సునామీలో ఎన్డీఏ బంగాళఖాతంలో కలవబోతోందని, మోదీ కుర్చీ దిగబోతున్నారని సీఎం అన్నారు. అటల్ బీహారీ వాజపేయి, ఆరెస్సెస్ చేయలేని పనిని 2029 ఎన్నికల్లో తమ నాయకుడు రాహుల్ గాంధీ చేసి చూపిస్తారని, ఎన్నికల యుద్ధంలో మోదీ ఓడించి గద్దె దింపుతామని, జంతర్ మంతర్ సాక్షిగా ఇదే తమ శపథమని, మోదీ పేరుతోనే ఎన్నికలకు రండి… బీజేపీకి 150 కంటే ఒక్క సీటు ఎక్కువ రానివ్వమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.