రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఎఎస్ అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలకు బయలుదేరారు. అనేక మంది ఐఏఎస్ అధికారులు ఏసీ గదులను వీడుతున్నారు. జిల్లాల్లో పనిచేసిన అనుభవమే గొప్పదని, సెక్రటేరియట్ స్థాయి హోదాకు వచ్చిన తర్వాత కేవలం ఫైళ్లు తిరగేయడం తప్ప ప్రజలతో మమేకమయ్యే అవకాశం రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలక్రిష్ణ నాయుడు రచించిన ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే సీఎం వ్యాఖ్యలకు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పనితీరు మినహాయింపుగానే చెప్పవచ్చు. సీఎం రేవంత్ ఆకాంక్షిన తరహాలో ఫీల్డు విజిట్ విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముందుండడం విశేషం. సామాన్యుడిలా జనంలోనే తిరిగుతూ వారి సమస్యలను ఆలకించే ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ క్షేత్ర స్థాయి పర్యటనలను మరింత ఉధ్రుతం చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు రైతుకు చెందిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట, ఆయిల్ పామ్ సాగు, విద్యుత్, ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన క్రింద కూర్చొని జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు.
పంట చేలల్లో తిరుగుతూ రైతుల సమస్యలను ఆలకించిన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ క్షేత్రస్థాయి పర్యటన వీడియోను ఇక్కడ చూడవచ్చు..