హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే..
- మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించాడు.
- .చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
- ఇక్కడ నాకేదో భూములు ఉన్నాయని.. అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
- ఇది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు.. భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం.
- ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు.
- నిజాం కాలంలో సికింద్రాబాద్ ను అభివృద్ధి చేశారు.
- ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది.
- గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
- మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
- ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం.
- ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి.
- దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.
- ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం.
- ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
- ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం.
- రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం.
- ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
- ఇందుకు మీ అందరి సహకారం ఉండాలి.. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.
- ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది.
- నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా.
- రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు.
- తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్న.
- అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం.
- డిసెంబర్ నెలలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం.
- అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాం.
- ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా.
- ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా.
- సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని భట్టి, శ్రీధర్ బాబు కు సూచన చేస్తున్నా.
- 2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలి.

