Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

తలుపులు మూసుకుని కొట్టుకోండి: తెలుగు మీడియా ‘టైకూన్’లకు సీఎం రేవంత్ సలహా

ఖమ్మం: తెలుగు మీడియా ‘టైకూన్’లుగా ప్రాచుర్యం పొందిన ఇద్దరు యజమానులకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. మీడియా యజమానులకు పంచాయతీ ఉంటే తలుపులు మూసుకుని వాళ్లూ వాళ్లూ కొట్టుకోవాలే తప్ప, తమ మంత్రులను బద్నాం చేయొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. సింగరేణి బొగ్గుగనుల టెండర్లు, మంత్రులపై ఇటీవల వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ స్పందించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం పరోక్షంగా ఎన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల యజమానులను ఉద్ధేశించి ఆయా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని కుట్రలు, కుతంత్రాలతో పడగొట్టాలని ఫాం హౌజ్ లోని శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడని సీఎం కేసీఆర్ ను ఉద్ధేశించి ఆరోపించారు. ఇందులో భాగంగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా ద్వారా అడ్డగోలు ప్రచారం చేయిస్తూ మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారని అన్నారు. సింగరేణి బొగ్గుగనులకు సంబంధించి తమ ప్రభుత్వంలో అక్రమాలు, అవకతవకలు జరిగే అవకాశమే లేదన్నారు. సీనియర్ల సలహాలతో, సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పారు. కోల్ మైన్ టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా, నిజమైన, నిఖార్సయిన, అనుభవం ఉన్నవాళ్లకే ఇస్తుందే తప్ప, అణా పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు.

‘అనవసరమైన, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా, అపోహలు కలిగిస్తూ మళ్లీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సహకారం జేస్తుండ్రు. మీకూ మీకూ మీడియాకు పంచాయితీలు ఉంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి, లేకపోతే ఒకరిమీద ఒకరు బురద చల్లుకోండి.. అందులో మమ్మల్ని లాగి, ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్లు ఇరిగినయట., ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండిగాని, మా మంత్రులను బద్నాం జేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచునికి, సుబాహునికి, శుక్రాచార్యునికి సహకారం అందించినట్లుగా ఉంటది. ఒక్కసారి ఆలోచన చేసి, వాస్తవాలను తెలుసుకుని, రాసేముందు మమ్మల్ని వివరణ అడగండి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకు 24 గంటలు, సంవత్సారానికి 365 రోజులు ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ, మీడియాకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ పేపర్ లో వచ్చినా, టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా., ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిపై ఆరోపణ వచ్చినా, వాళ్లందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వంపట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి.’ అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాను కోరారు.

Popular Articles