Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

పొంగులేటి మంత్రిత్వ శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిత్వ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాన్స్ దొరికితే సీఎం సీట్లో కూర్చునే స్థాయి లీడర్ గా తన అభిమానులు అభివర్ణించుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. అంతేకాదు పొంగులేటిని సీఎం రేవంత్ రెడ్డి ‘శీనన్న’గానే సంబోధించడం మరో విశేషం. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో జరిగిన బహిరంగసభలో మంత్రి పొంగులేటిని సీఎం రేవంత్ అడుగడుగునా కీర్తిస్తూ ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. ఇదే సందర్భంలో పొంగులేటికి మంత్రివర్గంలో దక్కిన శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల సందర్భంగా ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమంపై తాము ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. తాము ఆశించినట్లుగానే, ప్రజలు ఊహించినట్లుగానే తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరగాలంటే బలమైన, పనిచేయగలిగిన, సమర్ధవంతమైన నాయకుడు మంత్రిగా ఉండాలని ఆలోచించినట్లు రేవంత్ చెప్పారు. రోజుకు 18 గంటలు కష్టపడే తత్వం ఉన్న పొంగులేటి శీనన్నకు గృహనిర్మాణ శాఖ అప్పగిస్తే తప్ప ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇంటి కల నెరవేరదని భావించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖను కూడా పొంగులేటి కోరలేదని, దయ్యంలా పట్టుకున్న ధరణిని పాతరేయడానికి, భూభారతిని తీసుకురావాలని, ఇందుకు రైతుబిడ్డ ఉండాలని భావించానని, అందుకే పొంగులేటిని రెవెన్యూ, గృహనిర్మాణశాఖలను అప్పగించినట్లు సీఎం పేర్కొన్నారు. పేదల కల నెరవేరాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా పొంగులేటిని సమర్ధునిగా భావించి సోనియాగాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంకగాంధీతో, మల్లిఖార్జున ఖర్గేలతో మాట్లాడి శీనన్నకు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలను తానే ఇచ్చానని రేవంత్ వివరించారు.

వాస్తవానికి ఈ శాఖలను తానే తీసుకోవచ్చని, ముఖ్యమంత్రిగా తనకు ఏ శాఖనైనా తీసుకునే అధికారం ఉందని చెప్పారు. కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా, కేసీఆర్ సంగతి చూడాలన్నా తనకు సమయం సరిపోదని, అందువల్ల సరిగ్గా పనిచేసే సమర్ధవంతమైన మంత్రి ఇందుకు ఉండాలని శీనన్నను నియమించినట్లు సీఎం చెప్పారు. శీనన్న విషయంలో తన అంచనా తప్పలేదని, ఢిల్లీ ముందు తలవంచుకునే పరిస్థితిని శీనన్న తీసుకురాలేదని సీఎం రేవంత్ కొనియాడారు. తన శాఖల నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసి 99.9 శాతం సమస్యలను పరిష్కరించారని, పేదలకు న్యాయం చేశారని, ధరణిని బొంద పెట్టారని రేవంత్ పొంగులేటిని కొనియాడారు. అంతేకాదు జిల్లాలోని ఎమ్మెల్యేల సమస్యలను తీర్చే బాధ్యతను కూడా మంత్రి పొంగులేటికే అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. వచ్చే పది రోజుల్లో ఎమ్మెల్యేలతో, ఎంపీలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను పొంగులేటికి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

.

Popular Articles