శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుల, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.
నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.