Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘రైతు భరోసా’పై సీఎం కీలక ఆదేశాలు

రైతు భరోసా పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పంట వేసినా, వేయకపోయినా సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధులు చెల్లించాలని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకాలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు హైదరాబాద్ లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అదేవిధంగా సేద్యానికి పనికిరాని భూములకు రైతు భరోసా నిధులు చెల్లించరాదని, అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములను, లే అవుట్ భూములను, నాలా కన్వర్ట్ అయిన భూములను, మైనింగ్ భూములను, గోదాములు నిర్మించిన భూములను,
ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలన్నారు.

కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోఢీకరించుకోవాలని, వీటితోపాటు విలేజ్ మ్యాపులను పరిశీలించి అధికారులు ఫీల్డ్ కు వెళ్లి ధ్రువీకరించుకోవాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని, వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలన్నారు. ఈ అంశంలో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావు కల్పించరాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 26 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని కూడా సీఎం వెల్లడించారు.

Popular Articles