Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రైతు భరోసా, సా..గుతుందా? సీఎం ప్రకటన భావమేంటి!?

రైతు భరోసా నిధులపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్తతనిచ్చిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు టకీ..టకీ..మంటూ జమ అవుతాయని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. గత ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులపై చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్ కు సంబంధించి నిధుల జమకు ఉద్యుక్తమైంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత జనవరి 26 తర్వాత రైతు భరోసా నిధులకు గ్యారంటీ ఇచ్చారు.

ఇందులో భాగంగానే నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్ళ ఇండ్ల పథకాలను సీఎం ప్రారంభించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సభలో ప్రారంభించిన నాలుగు అద్భుత సంక్షేమ పథకాలను తెలంగాణా ప్రజలకు అంకితం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఆయా పథకాలను మార్చి 31వ తేదీలోగా నింతరంగా అమలు చేస్తామని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

అయితే ఇదే సందర్భంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన 10 వేల కోట్ల రూపాయలను మార్చి 31వ తేదీలోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ఇదే సభలో ప్రకటించం గమనార్హం. దీంతో రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాతిపదికన 65 రోజులపాటు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వంతులవారీగా జమ కావడం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ జరిగింది. తొలి రోజు ఎకరం, మరుసటి రోజు రెండెకరాలకు, మూడో రోజు 3 ఎకరాలు, ఆ తర్వాత ఐదెకరాల్లోపు, చివరగా గరిష్ట స్థాయి ఎకరాలకు ప్రభుత్వం నిధులు జమ చేసేంది. మొత్తంగా ఈ ప్రక్రియ దాదాపు నెల రోజులపాటు సాగేది.

కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చంద్రవంచ సభలో ప్రకటించిన ప్రకారం ఈసారి రైతు భరోసా నిధులు మొత్తం జమ కావడానికి రెండు నెలలకు పైగా వ్యవధి తీసుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్కారు ఖాజానా స్థితి, నిధుల సమీకరణ ఇందుకు కారణమని పాలకవర్గ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇంతకీ చంద్రవంచ సభలో రైతు భరోసా పథకం నిధుల జమ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు..

Popular Articles