అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గీత దాటి ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సీఎల్పీ మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం మండిపడినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే, ఆయా నాయకులే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభంకన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే అంతిమమని, దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకట స్వామిలు వేర్వేరుగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో చేసిన హెచ్చరిక రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.