Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఢిల్లీ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు. కుల గణన సర్వే ప్రకారమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అందుకు సంబంధించిన ముఖ్యాంశాలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే..

  • బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ ఆమోదం కోసం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని పది రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోరాం.
  • కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచరులు, పీసీసీ అధ్యక్షుడు ఒక నిర్ధారణకు వచ్చారు.
  • అయినా 5,6,7 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చింది.
  • మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం.
  • దురదృష్టవశాత్తు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు.
  • ఇది శోచనీయం.. బాధాకరం.. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం.
  • బలహీనవర్గాల హక్కులను కాలరాయడానికి బీజేపీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూ వస్తోంది.
  • ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే కమండల్ కమిషన్ ను తీసుకొచ్చింది.
  • రథయాత్ర పేరుతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును బీజేపీ అడ్డుకుంది.
  • ఆ తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే…
  • యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో బీజేపీ ఆ రిజర్వేషన్లు కూడా అడ్డుకుంది.
  • కానీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఆ రిజర్వేషన్లను అమలు చేశారు.
  • ఇప్పుడు మేం మొదలు పెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవాలని చూస్తున్నారు.
  • బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బీజేపీ వితండవాదం చేస్తోంది.
  • మేం పంపించిన బిల్లుల్లో ఏదైనా మతానికో, కులానికో రిజర్వేషన్ ఉందా..?
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్ గా కేటాయించడం జరుగుతుంది.
  • కులాలు, ఉపకులాల రిజర్వేషన్లు ఎక్కడా లేవు… ఇప్పటి వరకు జరగలేదు.
  • దురదృష్టవశాత్తు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు.
  • వారు చట్టాన్ని చదివారో లేదో.. లేక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు తెలియదు.
  • ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నామని వితండవాదం చేస్తున్నారు.
  • అందుకే సూటిగా అడుగుతున్న..
  • 2017 లో రాజస్థాన్ నుంచి అబ్దుల్ సత్తార్ ఒక వెనకబడిన ముస్లిం అయినా యూపీఎస్ లో ఓబీసీ రిజర్వేషన్ సాధించాడు.
  • 1971 నుంచి నూర్ బాషా, దూదేకుల, ఇతర వివిధ వృత్తులను చేసే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి.
  • ఆ రిజర్వేషన్లు RSS కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ఉన్నాయి, మోదీ జన్మించిన గుజరాత్ లో ఉన్నాయి.
  • మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయి.
  • మీరే కేంద్రంలో ఉండి ఆ రాష్ట్రాల్లో ముస్లింలకు ఒబీసీ రిజర్వేషన్లకు అనుమతిస్తున్నారు.
  • ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చానని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.
  • సామాజిక, ఆర్ధిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి.
  • మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు.. మేం అలాంటి రిజర్వేషన్లు చేయలేదు.
  • అయినా వాళ్లు వితండవాదం చేస్తున్నారు.
  • ముస్లింల సాకుతో బీజేపీ ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తోంది.
  • బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోంది.
  • ఎలాగైనా కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీతో అంటకాగుతున్నారు.
  • బీజేపీ చేస్తున్న తప్పిదాలను బీఆరెస్ ఎందుకు ప్రశ్నిచడంలేదు?
  • ఎందుకు నిన్నటి ధర్నాలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు?
  • మద్దతు ఇవ్వకపోగా మేం చేసిన ధర్నాను అవహేళన చేస్తున్నారు.
  • తాటి చెట్టంత పెరిగితే సరిపోదు.. ఆవగింజంత అవగాహన కూడా ఉండాలి.
  • మా చేతులు కట్టేసేలా బీఆరెస్ వ్యవహరిస్తుంది తప్ప.. బీసీలకు మద్దతు ఇవ్వాలన్న సోయి లేదు.
  • బీజేపీ, బీఆర్ఎస్ లను బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తోంది.
  • తాత్కాలికంగా మీరు విజయం సాధించారని అనుకోవచ్చు.
  • కానీ ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది.
  • ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్ ను ఆమోదించాలి.
  • బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది.

Popular Articles