తెలంగాణా పల్లెల్లో బాగా పాపులర్ సామెత ఒకటి ఉంది. ‘కొట్టక, తిట్టక… తొడపాశం పెట్టుడు’ అనేది ఆ సామెత. ఏదేని సందర్భంలో మనకు పొడ గిట్టని వ్యక్తులను కొట్టినా, తిట్టినా అనవసరంగా అతనిపై సానుభూతిని కలిగించినట్లవుతుందని భావించి, ఎవరూ చూడకుండా ‘తొడపాశం’ పెడితే కలిగే ఆ నొప్పితో విలపించే బాధ వర్ణనాతీం. ఇప్పుడీ సామెత మననం దేనికంటే.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్న ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ చేస్తూ., బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బందీగానే ఉన్నారు.. ప్రత్యేకంగా ఆయనను జైలుకు పంపాల్సిన అవసరమే లేదన్నారు. చర్లపల్లి జైలుకు, ప్రస్తుతం కేసీఆర్ ఉంటున్న ఎర్రవల్లి ఫాం హౌజ్ కు పెద్ద తేడా ఏమీ లేదనేది రేవంత్ రెడ్డి నిర్వచనం. ఫాం హౌజ్ చుట్టూ కేసీఆర్ కు కాపలాగా పోలీసులు ఉంటారని, చర్లపల్లి జైలులోనూ పోలీసులు ఇలాగే ఉంటారన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ కు అప్పుడప్పుడు సందర్శకులు వస్తుంటారని, చర్లపల్లి జైలుకు కూడా ములాఖత్ ల కోసం ఇలాగే వస్తుంటారన్నది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో గూఢార్థం కాబోలు. అందువల్ల కేసీఆర్ స్వీయ నియంత్రణ జైల్లో బందీగానే ఉన్నారని, ప్రత్యేకంగా ఆయనను జైలుకు పంపాల్సిన అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ ను ఓడించడమే శిక్ష అని, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు సమాచారం లేదని సీఎం పేర్కొన్నారు. విపక్షంలో గల నాయకుల ఆరోగ్య పరిస్థితిపై గతంలో వ్యవహరించిన కొందరు నేతలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే ఉద్ధేశం తనకు లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఢిల్లీ విలేకరులతో నిర్వహించిన ‘ఇష్టాగోష్టి’లో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ జరగడం కూడా సహజమే. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని, తన పదేళ్ల పాలన అనుభవాన్ని రంగరించి రాష్ట్ర అభివృద్ధికి సముచిత సూచనలు ఇవ్వాలని, కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనలు సద్విమర్శగా ఉంటే శషభిషలు లేకుండా తాను స్వీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కోరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీ ముఖం కూడా చూడడం లేదని, అసెంబ్లీకి రాని నాయకుడికి ప్రతిపక్ష హోదా ఎందుకని కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నా సరే కేసీఆర్ సారు మాత్రం తన ఫాం హౌజ్ వదిలిపెట్టడం లేదనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంలో పోలీసు అధికారులపై కేసులు, అరెస్టులు, విచారణలు జరుగుతుండగానే అప్పటి పాలక పెద్దల పేర్లు బహిర్గతం కావచ్చనే భిన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో తెమిలే అవకాశం కనిపించడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన ఉదంతంపై 655 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోని సారాంశాన్ని దాదాపు 60 పేజీలకు కుదించి (సంక్షిప్తీకరించడం) కేబినెట్ లో చర్చించి, ఆమోదించి, ‘కూలేశ్వరం’ ఘటనకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్ మాత్రమేనని బహిర్గతం చేశారు. నివేదిక ప్రకారం సూత్రధారులపై, పాత్రధారులపై ఎటువంటి చర్య తీసుకోవాలో నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించి, సభ్యుల అభిప్రాయాలను స్వీకరించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వెల్లడించారు.

ఈ సందర్భంగానైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం అనివార్యమని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. కానీ జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను ‘కాంగ్రెస్’ రిపోర్టుగా గులాబీ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. ‘రివర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ఇస్తున్నారు. ఇటువంటి తాజా రాజకీయ పరిణామాల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీయడం విశేషం. కేసీఆర్ సేద తీరుతున్న ఫాం హౌజ్ ను జైలుతో, ఆయన భద్రతా సిబ్బందిని చర్లపల్లి జైలుకు కాపలాగా ఉండే పోలీసులతో పోల్చడం, కేసీఆర్ ను కలవడానికి వెళ్లే పార్టీ నాయకులను, కేడర్ ను ‘సందర్భకులు’గా రేవంత్ అభివర్ణించడంపై భిన్న చర్చే సాగుతోంది. దీన్నే ‘కొట్టక, తిట్టక.. తొడపాశం పెట్టుడు’ అంటారనే సామెతకు అన్వయిస్తూ రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ సాగుతుండడం విశేషం.
ఓ నాయకుడి భవిష్యత్ ఆలోచనను డైవర్ట్ చేసేందుకు, తాను ఉంటున్న ప్రదేశంపై ఆ నాయకుడికే ‘డౌట్’ కలిగే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించకుండా ఫాం హౌజ్ లో ప్రశాంత జీవనం గడుపుతున్న కేసీఆర్ ను ఉద్ధేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఓ ‘మైండ్ గేమ్’గా పలువురు అభివర్ణిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను కేసీఆర్ చదివి ఉంటే, తన చుట్టు గల భద్రతా సిబ్బందిని చూసినపుడు, తాను కదలని ఫాం హౌజ్ ను పరిశీలించినపుడు.. ఔనా? నేను స్వీయ నియంత్రణలో ‘బందీ’ని అయ్యానా? అనే సందేహాలు ఆయనకు కలిగించడమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల అర్థం, పరమార్ధంగా నిర్వచిస్తున్నారు.

అంతేకాదు.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు పర్వం ఫలితంగా ఏర్పడిన రాజకీయ పరిణామాలు కేసీఆర్ ను అరెస్ట్ చేయడం వల్ల తెలంగాణాలో ఏర్పడకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అనే ప్రశ్నపైనా ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగినట్లు ప్రభుత్వ చర్యలే పేర్కొంటున్న అకృత్యాలపై, అరాచకాలపై రేవంత్ రెడ్డి పాలన నుంచి తెలంగాణా ప్రజానీకం ఆశించింది నిజంగా ఇదేనా..? అనే సందేహాలు కూడా మరోవైపు వ్యక్తమవుతుండడం అసలు కొసమెరుపు.