కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారం దిశగా తెలంగాణా ప్రభుత్వం డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారం దిశగా ఈ కమిటీ పని చేయనుంది.
ఇందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థి ప్రతినిధులు, జేఏసీ,సివిల్ సొసైటీ గ్రూపులు సహా పలువురితో మంత్రుల కమిటీ చర్చించనుంది. మంత్రుల కమిటీ నియామకపు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గత రాత్రి వెల్లడించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. వివాదాన్ని పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. శుక్రవారం నుంచే మంత్రుల కమిటీ తమకు నిర్దేశించిన పనిలో నిమగ్నం కానుంది.
ఇదిలా ఉండగా కంచ గచ్చిబౌలి భూములపై డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని, సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని అన్నారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని ఇంటెలిజెన్స్ డీజీ, సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.