ములుగు: జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS) లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు 600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుంచి ఆమోదం తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
నెల రోజుల్లోపు దేవాదుల పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మార్చిలో మంత్రివర్గ సమావేశంలో అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామని చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా సీఎం చెప్పారు. భూములు కోల్పోయిన వారికి పరిహారాన్ని గ్రీన్ ఛానెల్ లో నిధులు మంజూరు చేస్తామన్నారు. భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

