Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

సీఎంను, నర్సంపేట ఎమ్మెల్యేను దొంతి కాంతమ్మ కలిపారు!

నర్సంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు.. అధికార పార్టీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది అత్యంత ఆసక్తికర ఘటన. ఇద్దరు వ్యక్తులు లేదా నాయకులు, కాదంటే కుటుంబాల మధ్య పెరిగిన అంతరాన్ని, తెగిన బంధాన్ని పెళ్లి, చావు.. ఈ రెండింట్లో ఏదో ఒకటి కలుపుతుందనేది తెలంగాణా పల్లెల్లో బలీయమైన సామెత. ఈ నానుడికి అనుగుణంగానే తెలంగాణా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలను ఓ మాతృమూర్తి దశదిన కర్మ కలపడం విశేషం. ఔను.. ఇన్నాళ్లూ ఎవరికెవరూ పట్టని విధంగా ఉన్నట్లు ప్రాచుర్యంలో గల సీఎం రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు కలిసిపోయారు. ఇప్పుడీ దృశ్యం నర్సంపేట కాంగ్రెస్ నాయకుల్లోనేకాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కేడర్ లో మాంచి జోష్ నింపిందనే చెప్పాలి. ఇక అసలు విషయంలోకి వెడితే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి తెలుసు కదా? గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం రేవంత్ ముఖం కూడా చూసిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల స్టార్ హోటల్ లో అభిప్రాయ సేకరణ జరిపిన సందర్భాన్ని మినహాయిస్తే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు పరస్పరం ఎక్కడా కలుసుకోలేదు, ఎదురుపడలేదు, ముఖముఖాలు కూడా చూసుకోలేదు. ఇందుకు బలమైన కారణం ఏదైనా కావచ్చుగాని, ఇద్దరి మధ్య గడచిన రెండేళ్లుగా అంతరం, అగాధం ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చాయి. అవి ఏ స్థాయి వరకు వెళ్లాయంటే..?

దొంతి కాంతమ్మకు శ్రద్దంజలి ఘటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

నిరుడు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో సంభవించిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల పర్యటనకు వచ్చారు. ఖమ్మంలో పర్యటన ముగించుకుని మానుకోటకు వెళ్లి అక్కడి కలెక్టరేట్ లో వరద నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గం కేంద్రం మీదుగానే, ఎమ్మెల్యే క్యాంపు ఆపీసు మీదుగానే సీఎం రేవంత్ కాన్వాయ్ వెళ్లింది. అయినప్పటికీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం పర్యటనలో ఎక్కడా పాల్గొనలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలోనూ దొంతి మాధవరెడ్డి ఆయనను ఎక్కడా కలవలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యటనకు సీఎం వచ్చిన సందర్భాల్లోనూ మాధవరెడ్డి ముఖం చాటేశారు.

ఈ పరిణామాల్లోనే నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆశించిన నిధులు రావడం లేదనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ దొంతి మాధవరెడ్డి ఎక్కడా జంకలేదని స్థానిక నాయకులు చెబుతుంటారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పేరుంది. మాజీ హోం మంత్రి కె. జానారెడ్డితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ అమాత్య పదవి కోసం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి నేతలను కలిసిన దొంతి మాధవరెడ్డి తన వినతిని వాళ్ల ముందుంచారు. కానీ మంత్రి పదవి అంశంలో సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం దొంతి మాధవరెడ్డి ఆశ్రయించలేదు. మొత్తంగా గడచిన దాదాపు రెండేళ్లుగా ఈ ఇద్దరి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది.

కాంగ్రెస్ కార్యకర్తలను చేయి ఊపి పలకరిస్తున్న సీఎం రేవంత్ పక్కనే ఎమ్మెల్యే మాధవరెడ్డి, మంత్రి పొంగులేటి, కడియం శ్రీహరి తదితరులు

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల కాలధర్మం చేశారు. ఆమె దశదినకర్మ కాజీపేటలోని ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతిలో చెయ్యి వేసి నవ్వుతూ అక్కడ గల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేయడం విశేషం. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ మరణవార్త తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ఫోన్ లో కూడా పరామర్శించారు. అయితే దశదినకర్మకు సీఎం హాజరవుతారనే ప్రచారాన్ని నర్సంపేట కాంగ్రెస్ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా నమ్మలేదు.

కానీ సీఎం రేవంత్ కాంతమ్మ కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం, ఎమ్మెల్యే.. ఇద్దరూ కలిసిపోయారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డిని మాధవరెడ్డి కార్యక్రమానికి ఆహ్వానించారా? లేక ఆయనే వచ్చారా? అనే ప్రశ్నకు మాత్రం ఇక్కడ స్థానం లేదు. ముందే చెప్పుకున్నట్లు.. దూరమైన ఇద్దరు వ్యక్తులను పెళ్లి లేదా చావు కలుపుతుంది. ఇక్కడా జరిగింది అదే.. సీఎం రేవంత్ రెడ్డిని, నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డిని ‘ దొంతి కాంతమ్మ’ కలిపారు.. అంతే!

Popular Articles