‘‘పైసా పైసా మొత్తం లెక్క మీకు అప్పజెప్త..ఏదెట్ల పంచాల్నో మీరే చెప్పుండ్రి.. ఒక్క పైసా కూడా నా బేజుల పెట్టుకోను.. అణా పైసల్తో సహా మీకప్పజెప్త.. నా నెల జీతం గూడ మీకే ఇస్త..ఎట్ల పంచుదమో చెప్పుండ్రి..సింపుల్ లెక్క జెప్త నేను.. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 18 వేల కోట్ల నుంచి 18 వేల 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తది..ఓ నెల 200 ఎక్కువ.. 200 తక్కువ.. ఇదీ ప్రతీ నెల ఆదాయం.. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్లు తదితర అవసరాలు.. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతీ నెల పదో తారీఖున లోపల కట్టాల్సి ఒస్తున్నది.. ఏడు లక్షల కోట్ల అప్పుల్జేసిండు.. కాళేశ్వరం లాంటి తప్పుల్జేసిండు.. ఈ రెండీటికి గల్పి, అప్పులకు, తప్పులకు గల్పి, ఇష్టమున్నా, లేకపోయినా, నాకు నచ్చినా, నచ్చకపోయినా ఆయన నాకిచ్చిన నజరానా ఏందయా అంటే.. ప్రతి నెలా 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోళ్లకు గట్టాల్సిందే.. నేనో పూట ఉాపాసం బండినా, బ్యాంకుల.. రిజర్వు బ్యాంకుల బడగానే వాళ్లే గుంజుకుంటరు.. నన్ను అడగను గూడ అడగరు.. మొత్తం 13,000 కోట్లు పోగా, ఇగ నా దగ్గర మిగిలింది 5 వేల నుంచి 5,500 కోట్లు. ఇగ నేను మిమల్నడుగుతున్న.. ఈ 5,500 కోట్లట్ల షాదీ ముబారకూ, కళ్యాణలక్ష్మీ, పెన్షనూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా.. ఇట్లా పాతిక, ముప్పయి వరకు సంక్షే పథకాలున్నయ్.. ఇవిగాక అర్థంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం గట్టాలె.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు గట్టాలె.. రీజనల్ రింగురోడ్డుకు నిధులియ్యాలె.. ఈ రాష్ట్రంల ఏం అభివృద్ధి జేయాలన్నా ఇందులో నుంచే తియ్యాలె.. ఇగ నాకున్న వెసులుబాటు 5 వేల నుంచి 5,500 కోట్లు. నేనిచ్చిన గ్యారంటీలుగాని.. అంతకుముందు ఒచ్చిన వారసత్వంగాని.. ఇయన్నీ గలిపితే నాకింకొక్క 18 వేల కోట్లు గావాలె వాస్తవంగా.. మొత్తంగా ఉన్నవాటిని, కనీసీ సంక్షేమ పథకాలను ఓ మాదిరిగా నడపాలంటే కనీసం 22 వేల కోట్లు గావాలె..’’
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం చెప్పిన ఆర్థిక లెక్కల క్లుప్త సారాంశమిది.
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల వంటి అనేక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు. నిధుల లేమి వల్లే ఒక్కో నెలలో ఒక్కో వర్గానికి, లేదా ఒక్కో విభాగపు ఉద్యోగులకు జీతభత్యాలు నిలిపేస్తూ, రైతుభరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల నిధుల విడుదలను సాగదీస్తూ సర్కారును నడుపుతున్నట్లు సీఎం వివరించారు. ప్రభుత్వ నిర్వహణ ఎలా సాగుతోందనే అంశాన్ని ఇంకా క్లియర్ గా చెప్పే యత్నంలో భాగంగా.. అవసరానికి సరిపడా ఆదాయం లేని కుటుంబ నిర్వహణలో ఇల్లు కిరాయ, పాల పైసలు, పిల్లల స్కూలు ఫీజులను సర్దుబాటు చేసే గడ్డు స్థితిని ఆసక్తికరంగా ప్రస్తావించారు. మొత్తంగా ‘ఊపర్ షేర్వాణీ, అందర్ పరేషానీ’ ఉర్దూ నానుడిని ఉటంకిస్తూ రాష్ట్ర అప్పులు, వడ్డీలు, కిస్తీలు, ఆదాయం లెక్కలను ఖుల్లం ఖుల్లగా వివరించారు.

అంతేకాదు ‘అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను’ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో రెండ్రోజుల క్రితం ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో సీఎం రాష్ట్ర ఆర్థిక స్థితిపై చెప్పిన మాటలకు కొనసాగింపుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు కూడా వల్లె వేస్తుండడం గమనార్హం.
ఉద్యోగులకు, పదవీ విరమణ చెందినవారికి చెల్లించాల్సిన పెండింగ్ నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలో చెప్పాలని ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాజాగా ఉద్యోగ సంఘాలను కోరారు. అంతకు ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిధుల లేమి అంశాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గ పర్యటనలో పొంగులేటి మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ విధానం ద్వారా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

ఈ విధంగా మరికొందరు మంత్రులు సైతం ప్రభుత్వం వద్ద నిధులు లేవనే అంశాన్ని తమ పర్యటనల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రైతు భరోసా నిధుల చెల్లింపు గడువునకు మరో 17 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో, రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదనే ఆరోపణల పరిణామాల్లో సీఎం నుంచి మంత్రులే కాదు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు కూడా పదే పదే ప్రజల ముందు రాష్ట్ర ఆర్థిక స్థితిని గుర్తు చేస్తుండడం గమనార్హం. దీంతో సర్కారు వద్ద పైసల్లేవంటూ ప్రజలను మానసికంగా సంసిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి. అయితే సీఎం నుంచి మంత్రుల వరకు చేస్తున్న ఈ వాదనపై ప్రజల్లో ఎటువంటి స్పందన లభిస్తుందనే అంశంపైనే భిన్నాభిప్రాయాుల వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..

