రాష్ట్ర అభివృద్ధికోసం తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోడెద్దుల్లా పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకల కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదంలా షడ్రుచులతో ఉన్నదని వర్ణించారు. తీపి, పులుపు , కారం.. కాస్త ఉప్పు కూడా ఉందన్నారు. ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ మరికొన్ని అంశాల్లో వారు చాలా లిబరల్ గా బడ్జెట్ ను రూపొందించారని సీఎం అన్నారు.
ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించారన్నారు. అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని బడ్జెట్లో విద్య, వైద్యం, పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. తానూ, ఉప ముఖ్యమంత్రి జోడెడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పారిశ్రామీకీకరణ అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతిభద్రతలతో మంచి పాలన అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్తు మంత్రి మండలి మంచి సంకల్పంతో ముందుకు పోతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాల వసతులు కల్పించాలని, అన్ని వర్గాల ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నదని, ఇందులో భాగంగానే వారు అభివృద్ధికి చెందాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టినట్లు చెప్పార. రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న మిగత రాష్ట్రాలతో పాటు, ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో అనేక రకాలైన కార్యక్రమాలను తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణము, హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్, కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేయాలని రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రజలందరి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయడానికి ముందుకు పోతున్నదని భట్టి పేర్కొన్నారు.