Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.

రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్ లో బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. సీఈ పోస్టులను 19 నుండి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుండి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుండి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుండి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుండి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుండి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుండి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుండి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుండి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు.

రాష్ట్రంలో అత్యంత ప్రాథాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Popular Articles