Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

చెరువులు జాగ్రత్త: సీఎం కేసీఆర్

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని, దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందన్నారు. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరిందన్నారు. నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Popular Articles