ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సరిగ్గా 28 రోజుల క్రితం.. గత నెల 25వ తేదీన సస్పెన్షన్ కు గురైన ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నోటిని తీపి చేస్తూ స్వీటు తినిపిస్తున్న ఆసక్తికర దృశ్యమిది. ఓ భార్యా భర్తల మధ్య వివాదం కేసులో, భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందుకు గాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం గత నెల 25న అధికారిక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సీఐ సత్యనారాయణ సస్పెన్షన్ ఘటనపై పోలీస్ శాఖలో భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు సీఐ బత్తుల సత్యనారాయణపై సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత, ఆయనను ఇల్లెందు నుంచి బదిలీ చేస్తూ, పక్కనే గల టేకులపల్లి సీఐగా పోస్టింగ్ ఇస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. టేకులపల్లి సర్కిల్ కేంద్రం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సొంత మండలం కూడా. తనకు పోస్టింగ్ వచ్చిన సంతోషంలోనే కాబోలు.. సీఐ సత్యనారాయణ ఎమ్మెల్యే కోరం కనకయ్యను మంగళవారం ఇల్లెందులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి స్వీటు తినిపిస్తున్న దృశ్యపు ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కంగ్రాచ్యులేషన్స్ సీఐ గారూ..’ అనే కాప్షన్ తో ఫొటో సోషల్ మీడియాలో తిరుగుతుండడం విశేషం.
