శాంతి చర్చలను కోరుకుంటున్న మావోయిస్టులకు ఇక ‘మార్గం’ మూసుకుపోయినట్లేనా? వచ్చే మార్చి నెలాఖరులోపు నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని పదే పదే ప్రకటిస్తున్న కేంద్రం తన శపథాన్ని నెరవేర్చుకునే దిశను మార్చుకునే పరిస్థితి లేనట్టేనా? శాంతి చర్చల అంశంపై తెలంగాణాకు చెందిన ముఖ్య రాజకీయ నేతల ప్రకటనలపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పందించిన తీరు ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. నక్సల్స్ తో శాంతి చర్చలు జరపాలని పీస్ డైలాగ్ కమిటీ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని తెలంగాణా పొలిటికల్ లీడర్లు చేస్తున్న డిమాండ్లకు సానుకూల ఫలితాలు లభించే అవకాశాలేవీ కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల్లో ఛత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఆ రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ చేసిన ప్రకటనలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
‘ఆపరేషన్ కర్రెగుట్ట’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవులను భద్రతా బలగాలు గడచిన పది రోజులుగా జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల పరిణామాలపై తెలంగాణాలోని ప్రజాస్వామిక శక్తులు వరుసగా స్పందించాయి. ఇందులో భాగంగానే నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ పీస్ డైలాగ్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ వివిధ పార్టీలతో, ముఖ్యులతో కలుస్తూ మద్ధతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావులతోపాటు న్యూడెమోక్రసీ, శనశక్తి, సీపీఎం, టీజేఎస్ తదితర పార్టీలు కూడా డిమాండ్ చేశాయి.

ఇదే దశలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని కూడా పీస్ డైలాగ్ కమిటీ నాయకులు ఇటీవల కలిశారు. తనను కలిసిన శాంతి కమిటీ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ హామీ ఇచ్చారు. నక్సలైట్లతో చర్చల అంశంలో పార్టీ సీనియర్ నేత, గతంలో చర్చల్లో పాల్గొన్న మాజీ మంత్రి కె. జానారెడ్డిని కలుస్తానని, చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చారు. నక్సలైట్ల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే కాకుండా, సామాజిక, ఆర్థిక సమస్యగా కాంగ్రెస్ ఎప్పుడూ పరిగణనలోకి తీసుకుని చూస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నక్సలైట్లతో శాంతి చర్చల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అంశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఓ వైఖరిని తీసుకునే ముందు అంశంపై పూర్తిగా చర్చాల్సి ఉందని, మంత్రివర్గ సహచరులతోనూ చర్చించిన తర్వాత ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తామన్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి కూడా నివేదిస్తామని, శాంతి కమిటీ అభ్యర్థనను సీనియర్ లీడర్లకు నివేదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన ఎల్కతుర్తి వేదికగా నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘బలముందని సంపుకుంట పోవుడు కాదు, మిలట్రీ ఉందని కొడ్తరు కావచ్చు.. కానీ అది ప్రజాస్వామ్యం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. యువకులను, గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారన్నారు. నక్సలైట్లను చర్చలకు పిలవాలని, వాళ్లేం మాట్లాడుతారో వినాలని సూచించారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని తాము తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని కూడా బీఆర్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.

ఇంకోవైపు తెలంగాణా ప్రభుత్వంలోని మరో మంత్రి, జనశక్తి పార్టీకి చెందిన మాజీ నక్సల్ నేత ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కూడా ఆపరేషన్ కగార్ పై స్పందించారు. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు. మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయని, అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయని, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయన్నారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని, బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నట్లు సీతక్క చెప్పారు.

బస్తర్ అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ పై తెలంగాణాలో ఇలా వరుసగా గొంతులు లేస్తున్న క్రమంలోనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక నేతలు స్పందించిన తీరు శాంతి చర్చలపై ఆశాజనక పరిస్థితులు లేవని చెప్పకనే చెబుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఛత్తీస్ గఢ్ సీఎం, హోం మంత్రి ఏమంటున్నారంటే…

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను తాను తప్పు పడుతున్నట్లు ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. ఆయుధాలను, హింసను విడనాడి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నక్సలైట్లను కోరుతున్నట్లు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావసం కల్పిస్తామని తాము ఇచ్చిన పిలుపునకు స్పందనగా వందలాది మంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారని, ఇటువంటి పరిస్థితుల్లో పదే పదే శాంతి చర్చల ప్రస్తావన అనవసరమని ఛత్తీస్ గఢ్ సీఎం స్పష్టం చేశారు. అడవుల్లో, కొండకోనల్లో ఉంటున్న నక్సలైట్లు అధునాతన ఆయుధాలతో ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకులను చంపేస్తున్నారని, మందుపాతరలతో పోలీసుల ప్రాణాలు కూడా తీస్తున్నారని, ఇవన్నీ మీకు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు శాంతి చర్చల ప్రయత్నాలపై ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ తెలంగాణా రాజకీయ నాయకులను ఉద్దేశించి కాస్త కటువుగానే ప్రశ్నించడం గమనార్హం. నక్సలైట్ల చర్యల వల్ల, ముఖ్యంగా మందుపాతరల వల్ల భద్రతా బలగాలే కాదు, చివరికి జంతువులు కూడా చనిపోతున్నాయని పేర్కొంటూ, అటువంటి సందర్భాల్లో వీళ్లు మాట్లాడరని, అసలు వీళ్లు ఎవరు? ఎందుకు మాట్లాడాలి? అని ప్రశ్నించారు. శాంతి చర్చలను ప్రస్తావిస్తున్న వారిని ఉటంకిస్తూ వీళ్లంతా దేశాన్ని భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నారని, వీటి వల్ల ఏమీ జరగదని అన్నారు. బస్తర్ ప్రాంతంలోని నక్సలైట్ల బాధితులు రాష్ట్రపతిని కూడా కలిశారని, బస్తర్ వాసులు నక్సలైట్లతో చర్చలను కోరుకోవడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ సీఎం, హోంమంత్రిల స్పందనను పరిశీలించినపుడు నక్సలైట్లతో శాంతి చర్చలకు అక్కడి పాలకులు సిద్ధంగా లేరనే అభిప్రాయాలు విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే మార్చి నెలాఖరులోపు నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే పునరుద్ఘాటిస్తున్న దిశగానే చర్యలు కొనసాగవచ్చని భావిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం గల ఛత్తీస్ గఢ్ లోనేగాక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషాల్లోనూ అధికారంలో గల పార్టీలను, కేంద్ర హోం మంత్రి నిర్దేశించిన తేదీని లోతుగా పరిశీలించినపుడు శాంతి చర్చల ప్రతిపాదన కార్యరూపంలోకి వచ్చే అవకాశాలు మృగ్యంగానే విప్లవ కార్యకలాపాల పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ఆపరేషన్ కర్రెగుట్ట పదోరోజూ కొనసాగుతోంది. నిన్న కర్రెగుట్టల్లోని కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు అక్కడ జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే.