తమ ప్రతిపాదనలకు అంగీరిస్తే తక్షణం కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు సిద్ధమని నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పందించింది. నిన్నటి ‘సమీక్ష’ న్యూస్ కథనంలో పేర్కొన్న విధంగానే ముందు నక్సల్స్ ఆయుధాలను వీడాలని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఈమేరకు ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు.
జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు తమ ప్రభుత్వం ఇప్పటికే పునరావాసం, ఉద్యోగ, ఉపాధి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అందువల్ల నక్సలైట్లు ఆయుధాలను వీడితేనే చర్చలకు అర్థముంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా నక్సలైట్లు సమాంతర పాలన చేయాలనుకుంటే చర్చలకు ఫలితం ఉండదన్నారు. బేషరతు చర్చలకు మాత్రమే తాము మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ చెప్పారు.
ఇదీ చదవండి:
కాగా శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిన్న సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాల కోసం తామెప్పుడూ శాంతి చర్చలకు సిద్ధమేనని, శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిది అభయ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
అయితే ఇందుకు కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణాల్లో చేస్తున్న జీనోసైడ్ (నరసంహారాన్ని)ను నిలిపివేయాలన్నారు. అంతేగాక సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని, తాము చేస్తున్న ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే తాము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.