Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నక్సల్స్ కు ఛత్తీస్ గఢ్ సర్కార్ వినూత్న ఆఫర్

అడవుల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టు పార్టీ నక్సలైట్ల కోసం ఛత్తీస్ గఢ్ సర్కార్ సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో బహుషా ఏ ప్రభుత్వం కూడా ఈ తరహా పథకాన్ని ప్రకటించిన దాఖలాలు లేకపోవడం విశేషం. జనజీవన స్రవంతిలో కలిసే నక్సలైట్లకు ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించడం కొత్తేమీ కాదు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని దేశంలోని నక్సల్స్ ప్రభావిత ప్రభుత్వాలు ప్రకటించడం మాత్రమే ఇప్పటి వరకు చూస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లకు వారి తలలపై గల నగదు రివార్డును వారికే ఇవ్వడం, వారిపై నమోదైన కేసుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించడం ద్వారా ‘మాజీలు’ మళ్లీ అడవులవైపు వెళ్లకుండా ప్రభుత్వాలు చూస్తుంటాయి. లొంగిపోయినవారి శాశ్వత పునారవాస చర్యల్లో భాగంగా అవసరమైనవారికి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయించిన ఉదంతాలు కూడా లేకపోలేదు. లొంగిపోయే నక్సలైట్ల పునరావాస చర్యల్లో భాగంగా తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులు కాస్త అటూ, ఇటుగా ఇవే తరహాలో ఉండడం చూశాం.

కానీ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వినూత్నంగా మావోయిస్టులకోసం సరికొత్త పథకాలను ప్రకటించడం విశేషం. అవేమిటంటే.. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుందని, ఉద్యమంలో కొనసాగుతూ స్టెరిలైజేషన్ చేయించుకున్నవారు జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం కూడా కల్పిస్తామని ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. లొంగిపోయిన తర్వాత పునరావాస కేంద్రాల్లో ఉంటున్న యువతీ, యువకులకు అవసరమైతే సామూహిక పెళ్లిళ్లు జరిపిస్తామని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. నక్సలిజం చాలా మందిని వారి కుటుంబాలకు దూరం చేయడమేగాక, వాళ్లకు తండ్రి అయ్యే ఆనందం కూడా కోల్పోయేలా చేస్తుందని ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ అన్నారు.

సుక్మా జిల్లా ఎస్పీ ముందు శనివారం లొంగిపోయిన మావోయిస్టులు

కాగా సుక్మా జిల్లాలో 23 మంది మావోయిస్టులు శనివారం  లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో సుక్మా జిల్లా మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను కిడ్నాప్ చేసిన ఉదంతంలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్ట్ నాయకుడు లోకేష్ కూడా ఉన్నారు. గడచిన 24 గంటల వ్యవధిలోనే ఛత్తీస్ గఢ్ లో 45 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నిన్న నారాయణపూర్ లో 22 మంది లొంగిపోగా, నేడు సుక్మా జిల్లాలో రూ. 1.18 కోట్ల రివార్డు గల 23 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ లొంగిపోయే నక్సలైట్ల కోసం ఇళ్లు, పెళ్లిళ్లు, ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం వంటి వినూత్న, ఆకర్షణీయ పథకాల ప్రకటన చేసినట్లు సమాచారం. బహుషా లొంగిపోయిన నక్సల్ జంటలు ఇచ్చిన సమాచారం ప్రామాణికంగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ తరహా ప్రకటన చేసి ఉంటుందని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Popular Articles