హైదరాబాద్: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపైన, అదే పార్టీకి చెందిన సత్తుపల్లికి చెందిన కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో A1గా సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత కూసంపూడి రవీంద్రను, A2గా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును పొందుపరుస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు బషీర్ బాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే.. సత్తుపల్లి పట్టణానికి చెందిన కూసంపూడి రవీంద్ర, ఖమ్మానికి చెందిన నెల్లూరి కోటేశ్వర్ రావులు ‘సిరిగోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను ఉప్పల్ లోని జీవీఆర్ సన్ షైన్ బిల్డింగ్, ఉప్పల్ భగాయత్ లో ప్రారంభించారు. సంస్థకు ఎటువంటి నిర్దేశిత అనుమతులు తీసుకోకుండా మాయమాటలు చెప్పి ప్రజల నుంచి డబ్బు వసూళ్లు చేశారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఉండే మక్కువను ఆసరాగా చేసుకుని దురుద్ధేశంతో వివిధ ప్రచార సాధనాలతో, రంగు రంగుల కరపత్రాలతో, బ్రోచర్లతో ఆకర్షించి వేలాది మందితో అక్రమంగా డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకున్నారు. అయితే చెప్పినవిధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా, ఎటువంటి విషయాలను చెప్పకుండా డబ్బు చెల్లించినవారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. స్కీంలో చెప్పిన విధంగా ఎటువంటి గోల్డ్ షాప్ పెట్టలేదు. ఇచ్చిన కూపన్లను వినియోగించుకునేందుకు ఎటువంటి వెబ్ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేయలేదు.
ఈ నేపథ్యంలోనే తాను కూడా కూసంపూడి రవీంద్ర, నెల్లూరి కోటేశ్వర్ రావులను నమ్మి సిరిగోల్డ్ స్కీంలో రూ. 15,000 మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టానని, ఇందుకుగాను తనకు ఐడీ నెం. 79105334 తనకు ఇచ్చారని ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. తనలాగే అనేక మంది నుంచి దాదాపు రూ. 15.00 కోట్ల నుంచి రూ. 20.00 కోట్ల వరకు వసూళ్లు చేశారని, తనకు తెలిసనవారు కావడంతో తాను హైదరాబాద్ వెళ్లిన ప్రతీసారి సిరిగోల్డ్ ఆఫీసుకు వెళ్లి అడిగేవాడినని పేర్కొన్నారు. కానీ ఏదేదో చెప్పి పంపేవారని, కొన్ని రోజులుగా ఎటువంటి రాబడులు ఇవ్వకుండా సిరిగోల్డ్ కార్యాలయం తెరవకుండా, కంప్యూటర్ హ్యాక్ అయిందనే కారణం చెబుతున్నారని పేర్కొన్నారు.

దీనివల్ల అమాయులు పెట్టుబడిదారులు తీవ్ర నష్టానికి, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, అమాయక ప్రజల వద్ద నుంచి అక్రమంగా డిపాజిట్లద్వారా డబ్బు వసూల్ చేసి విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాల్లో బినామీల పేరుమీద ఆస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నదని, కావున ఆయా వ్యక్తులపై విచారణ జరిపి బాధితులకు డబ్బు తిరిగి చెల్లించేవిధంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని యాసా నాగేశ్వర్ రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. ఈమేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును సిరిగోల్డ్ సంస్థ డైరెక్టర్ గా , సత్తుపల్లికి చెందిన మరో నాయకుడు కూసంపూడి రవీంద్రను మేనేజింగ్ డైరెక్టర్ గా పేర్కొంటూ, వారిద్దరిపై నమ్మకద్రోహం, ఛీటింగ్ అభియోగాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా తమపై వచ్చిన ఆరోపణలను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు, సత్తుపల్లి బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్రలు తోసిపుచ్చారు. ఈమేరకు నెల్లూరి కోటేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేస్తూ, సిరి గోల్డ్ సంస్థ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు తనను అప్రతిష్టపాలు చేయడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సిరి గోల్డ్ సంస్థతో తనకు గానీ, తన పెట్టుబడులకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ సంస్థలో తాను డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొంతమంది కావాలని బురద జల్లుతున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కూసంపూడి రవీంద్ర కూడా ఈ అంశంలో వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. పోలీసులకు వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చెప్పారు.
ఈ అంశంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో పూర్తిగా చదవవచ్చు..

