తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పీఏ) లమంటూ పలువురిని మోసగిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి (34), మచ్చ సురేష్ (30) హైదరాబాద్ నాగోల్‌లో నివాసముంటున్నారు. వీరు మంత్రి పొంగులేటి పీఏలమంటూ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయం మంత్రి పొంగులేటి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆయా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఇక నుండి తన పీఏలమంటూ ఎవరైనా ఫోన్ చేసినా, ఎటువంటి చిన్న అనుమానం కలిగినా సచివాలయంలోని తన కార్యాలయం 040-23451072 / 040-23451073 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. ఎవరైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



