Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

జగన్ ‘పాలసీ’కి జై కొడతారా..!?

ఒక ప్రభుత్వం.. ఓ బడా సంస్థ.. గంపగుత్త ఆదాయమే లక్ష్యంగా ఇసుక సంపద ఏకవ్యక్తికి ధారాదత్తం. తన చేతికి చిక్కిన ఇసుక సంపదను ‘సబ్ కాంట్రాక్టు’ తరహాలో చిన్నపాటి ఇసుక దందారాయుళ్లకు బడా కాంట్రాక్టు సంస్థ నిర్వాహకుడైన ఏకవ్యక్తి జిల్లాల వారీగా, రెవెన్యూ డివిజన్ల వారీగా ముక్కలు చేసి కట్టబెట్టిన వైనం. వెరసి సామాన్యుడికి ఇసుక అందనంత ఎత్తులో ధర పెరిగిపోవడం. అంతేకాదు తమకు ఇష్టమైన వ్యక్తులకు మాత్రమే ఇసుకను విక్రయించుకున్న ఇష్టానుసార సబ్ కాంట్రాక్టర్ల రీతి.. వెరసి ఓ ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు కలిగి ఘోరాతి ఘోరంగా గద్దె దించిన దృశ్యం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది.

పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లో నిరుడు అధికారాన్ని కోల్పోయిన జగన్ పార్టీ ఓటమికి గల పలు ప్రధాన కారణాల్లో ‘ఇసుక విధానం’ అత్యంత కీలకమైనదిగా ప్రచారం జరిగింది. ప్రభుత్వ పతనానికి దారితీసిన ముఖ్య కారణాల్లో ఒకటిగా వార్తల్లోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కారు అవలంభించిన ‘ఇసుక పాలసీ’ని తెలంగాణా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అమలు చేయబోతున్నదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వ్యాపారంతో సంబంధాలు గల కాంట్రాక్టు వర్గాల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇది.

వైఎస్ జగన్

ఇసుక దందాతో సంబంధం గల వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తెలంగాణాలో జగన్ సర్కారు ఇసుక విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈ అంశంలో ఆయా మంత్రి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు కొందరితో గట్టి సంబంధాలను ఏర్పరచుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారనేది ఆయా ప్రచారపు సారాంశం. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 17 ఇసుక క్వారీలపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ సర్కారు ఏటా రూ. 750 కోట్ల మొత్తానికి ఈ విషయంలో అప్పట్లో ఈ ఒప్పందం చేసుకుంది. ఇదే విధానంలో తెలంగాణాలో కూడా ఒప్పందం చేసుకోావలని కీలక మంత్రి ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు భిన్న కథనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టరు చేతికి ఇసుక దందాను అప్పగించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వ్యాప్తిలో గల కథనాల సారాంశం. అయితే ఈ విషయంలో మంత్రి పంతం నెరవేరుతుందా? లేదా ? అనేది మరికొద్దిరోజుల్లో తేలుతుందని ఇసుక కాంట్రాక్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన నివాసంలో మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించడం గమనార్హం. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరలకే ఇసుక లభించేలా చర్య తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. ఆయా పరిణామాల్లో ఇప్పుడున్న ఇసుక విధానాన్నే ప్రభుత్వం కొనసాగిస్తుందా? ఏవేని మార్పులు చేస్తుందా? అనే ప్రశ్నలపై మున్ముందు స్పష్టత రావచ్చని ఇసుక కాంట్రాక్టర్లు భావిస్తున్నారు.

Popular Articles